ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆధ్యాత్మిక యాత్రికుల నుంచి ఆటో, షేర్ ఆటో డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ వరుస ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఈ వ్యవహారాన్ని జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది.
దీంతో, జిల్లా కలెక్టర్ మయూర్ దీక్షిత్ ఆదేశాల మేరకు, వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలకు దిగారు. అసిస్టెంట్ రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (ARTO) నిఖిల్ శర్మ, సినిమా స్టైల్లో సాధారణ ప్రయాణికుడిలా మారువేషం వేసుకుని క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు.
ఆయన రాణిపూర్ మోడ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఉన్న 3 కిలోమీటర్ల దూరానికి వెళ్లేందుకు ఒక షేర్ ఆటో ఎక్కారు. ఆ మార్గానికి ప్రభుత్వం రూ.50 మాత్రమే ఛార్జీగా నిర్ణయించగా, ఆటో డ్రైవర్ ఆయనను రూ.300 డిమాండ్ చేశాడు. ఛార్జీ ఎక్కువని ప్రశ్నించినప్పటికీ డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు.
వెంటనే తన అసలు గుర్తింపును బయటపెట్టిన అధికారి, నిబంధనలు ఉల్లంఘించిన ఆ ఆటోను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకున్నారు. రవాణా శాఖ నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్లో మొత్తం 105 వాహనాలకు జరిమానా విధించగా, 25 వాహనాలను సీజ్ చేశారు.
ప్రజలను, పర్యాటకులను మోసగించి అధిక ఛార్జీలు వసూలు చేసే డ్రైవర్లపై ఇకముందు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తీవ్రంగా హెచ్చరించారు.

Leave a Reply