“3 మిలియన్ డాలర్ల ఆస్తి ఉన్నా 88 ఏళ్ల తండ్రికి సహాయం చేయడానికి నిరాకరించిన కుమార్తె.. ఆమె ప్రవర్తనపై నెట్టింట పెను చర్చ.. ఇదేనా పాశ్చాత్య సంస్కృతి?”

అమెరికాలో ఎంతో ప్రజాదరణ పొందిన ‘ది రామ్సే షో’ (The Ramsey Show) కార్యక్రమంలో ప్రసారమైన ఒక సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం రేపుతోంది.

56 ఏళ్ల రిటైర్డ్ మహిళ ఒకరు, తన 88 ఏళ్ల తండ్రి అప్పుల్లో మునిగిపోయారని, ఆ అప్పు తీర్చడానికి ఆయన 55,000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 52 లక్షలు) అడుగుతున్నారని, కానీ ఆ డబ్బు ఇవ్వడం తనకు ఇష్టం లేదని ఆ షో హోస్ట్‌కు ఫోన్ చేసి సలహా అడిగారు.

ఆ దంపతులకు దాదాపు 2 నుండి 3 మిలియన్ డాలర్ల (రూ. 16 కోట్ల నుండి 25 కోట్ల వరకు) ఆస్తి ఉన్నట్లు బహిరంగంగానే ఒప్పుకున్నప్పటికీ.. ఆ డబ్బు అంతా తమ రిటైర్మెంట్ పెట్టుబడులలో (Retirement Investments) లాక్ అయి ఉందని, దాన్ని ముట్టుకోవడానికి తాము ఇష్టపడటం లేదని వారు తెలిపారు.

కన్న తండ్రి అని కూడా చూడకుండా, అంత పెద్ద మొత్తంలో ఆస్తి పెట్టుకుని సహాయం చేయడానికి నిరాకరిస్తున్న వారి మనస్తత్వం నెటిజన్లను, ముఖ్యంగా భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ వార్త భారతీయ నెటిజన్ల మధ్య ఒక పెద్ద చర్చకు దారితీసింది. “ఇన్ని కోట్ల ఆస్తి ఉండి కూడా, కన్న తండ్రి అప్పుల భారాన్ని పంచుకోవడానికి వెనుకడటం మానవత్వ రహితమైన చర్య” అంటూ చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

భారతీయ కుటుంబ విలువలతో పోలుస్తూ పలువురు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. “వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వదిలేయడం, పిల్లలను ఒక నిర్దిష్ట వయసు రాగానే ఇళ్ల నుండి బయటకు పంపేయడం వంటి పాశ్చాత్య సంస్కృతి (Western Culture) కుటుంబ బంధాల పునాదులనే చిన్నాభిన్నం చేసింది. డబ్బు మాత్రమే జీవిత పరమావధిగా మారిపోవడం విచారకరం” అని నెటిజన్లు పేర్కొంటున్నారు.

మరోవైపు, “తమ సొంత డబ్బును దాచుకునే హక్కు వారికి ఉంది, తండ్రి చేసిన అప్పులకు ఆయనే బాధ్యుడు” అంటూ కొందరు పాశ్చాత్య ధోరణిని సమర్థిస్తున్నప్పటికీ.. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులపై చూపించే ప్రేమ, వారికి అందించే ఆర్థిక భరోసా పాశ్చాత్య దేశాల కంటే ఎంతో ఉన్నతమైనవని ఈ చర్చ మరోసారి నిరూపించింది.

“ఇలాంటి అభివృద్ధి మాకు అవసరం లేదు; మా సంస్కృతే మాకు గొప్పది” అంటూ నెటిజన్లు పెడుతున్న పోస్టులు ఈ చర్చను మరింత బలపరుస్తున్నాయి.


Posted

in

by

Tags: