సుమారు మూడు దశాబ్దాల కాలంలో ఒక మహిళను దాదాపు 1,000 మంది పురుషులతో లైంగికంగా పాల్గొనేలా బలవంతం చేసిన కేసులో ఒక వ్యక్తికి 16 ఏళ్ల జైలు శిక్ష పడింది.
ఏం జరిగింది? నోర్ఫోక్లోని స్టార్స్టన్కు చెందిన 67 ఏళ్ల రాడ్నీ జాన్స్టన్ అనే వ్యక్తి, తన వికృత లైంగిక కోరికలను తీర్చుకోవడానికి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ మహిళను గ్రామీణ ప్రాంతాలు, హోటళ్లు మరియు వాహనాల్లో అపరిచిత వ్యక్తులతో లైంగికంగా పాల్గొనేలా బెదిరించాడు. రోజుకు 15 మంది వరకు పురుషులు ఆ మహిళపై లైంగిక దాడి చేసేవారని, ఈ ఘటనలు గంటల తరబడి కొనసాగేవని కోర్టుకు తెలిసింది.
బయటపడిన ఆధారాలు: నిందితుడు జరిపిన ఈ అమానుషాన్ని డాక్యుమెంట్ చేస్తూ, అతను సేకరించిన 30,000కు పైగా ఫొటోలు మరియు వీడియోలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారానికి ఐదు రాత్రుల పాటు ఆ మహిళను బయటకు పంపి, అపరిచిత వ్యక్తులతో లైంగికంగా పాల్గొనేలా బలవంతం చేసినట్లు కోర్టులో వెల్లడైంది. నిందితుడు సోషల్ మీడియా వేదికల ద్వారా పురుషులను సంప్రదించి, ఆ మహిళతో లైంగిక సంబంధం కోసం సమయం, స్థలాన్ని నిర్ణయించేవాడని తెలిసింది.
బాధితురాలి ఆవేదన: తనను ఒక వస్తువులా చూసిన రాక్షసుడు జాంస్టన్ అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. 1994 నుండి 2024 వరకు, అంటే 30 ఏళ్ల పాటు ఈ నరకం కొనసాగిందని, నిందితుడు తనను భయంతో బందీని చేశాడని ఆమె తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. విచారణ జరుగుతున్నంత కాలం, ఆ మహిళ తన అంగీకారంతోనే ఇదంతా జరిగిందని జాంస్టన్ వాదించినప్పటికీ, కోర్టు అతడిని దోషిగా తేల్చింది.
వెలుగులోకి వచ్చింది ఎలా? 2024 జూలైలో బాధితురాలి పిల్లల దృష్టికి ఆ అశ్లీల చిత్రాలు రావడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తద్వారా ఈ భయంకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
