30 కిలోల బరువు తగ్గి రూ.2.5 లక్షలు కొట్టేసిన ఉద్యోగి..! 104 నుండి 74 కిలోలకు.. సీఈఓకే సవాల్ విసిరి గెలిచేశాడుగా! క్రేజీ సంఘటన!

ప్రముఖ ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ కంపెనీ ‘జెరోధా’ (Zerodha) సహ-వ్యవస్థాపకుడు మరియు సీఈఓ అయిన నితిన్ కామత్, తన సంస్థ ఉద్యోగితో పెట్టుకున్న ఒక ఫిట్‌నెస్ ఛాలెంజ్ (Fitness Bet) లో ఓడిపోయి రూ.2.5 లక్షలు కోల్పోయిన ఆసక్తికరమైన విషయాన్ని ఎక్స్ (X) ప్లాట్‌ఫారమ్‌లో పంచుకున్నారు.

జెరోధా సంస్థలో కంటెంట్ మరియు మీడియా స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తున్న రోహిత్ అగర్వాలా అనే ఉద్యోగి.. గత ఏడాది కాలంగా కఠిన శ్రమతో ఏకంగా 30 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించి రోహిత్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. “నితిన్ కామత్‌తో జరిగిన హెల్త్ ఛాలెంజ్‌లో గెలిచి రూ.2.5 లక్షలు అందుకోవడం నా జీవితంలోనే అతిపెద్ద గర్వకారణమైన క్షణం” అని పేర్కొంటూ నితిన్‌తో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేసి మురిసిపోయాడు.

ఏప్రిల్ నెలలో 104 కిలోల బరువుతో ఉన్న రోహిత్, జూన్ నెలలో ఈ ఛాలెంజ్ ప్రారంభించే సమయానికి 95 కిలోలకు చేరుకున్నాడు. జనవరి నాటికి బరువును 75 కిలోలకు తగ్గించుకోవాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించిన అతను.. జనవరి 8వ తేదీ నాటికే తన బరువును 74.5 కిలోలకు తగ్గించుకుని నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా అధిగమించాడు.

రోహిత్ మాట్లాడుతూ.. “డబ్బు అనేది ఇక్కడ రెండో ప్రాధాన్యత మాత్రమే. నా శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టి 30 కిలోల బరువు తగ్గడమే నాకు లభించిన అతిపెద్ద బహుమతి. జెరోధా సంస్థలో ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించే మంచి వాతావరణం (ఫిట్‌నెస్ కల్చర్) ఉండటమే నా ఈ విజయానికి ప్రధాన కారణం” అని తెలిపాడు.

“ఈ బెట్‌లో నేను ఓడిపోయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది” అని నితిన్ కామత్ గర్వంగా పోస్ట్ చేయగా.. నెటిజన్లు స్పందిస్తూ “డబ్బు ఓడిపోయినా, జీవితంలో గెలిచారు.. డబ్బును కోల్పోవడానికి ఇంతకంటే అద్భుతమైన మార్గం మరొకటి లేదు!” అంటూ ఇద్దరినీ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.


Posted

in

by

Tags: