సాధారణంగా మనం 30 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టినప్పుడు, శరీరంలో శక్తి తగ్గడం, వేగంగా బరువు పెరగడం వంటి అనేక మార్పులను గమనిస్తుంటాం.
దీనికి ప్రధాన కారణం ‘మెటబాలిజం’ (వయసు పెరిగే కొద్దీ జరిగే జీవక్రియలో మార్పులు). మనం తీసుకునే ఆహారాన్ని శరీరానికి అవసరమైన శక్తిగా మార్చే ఈ ప్రక్రియ, వయసు పెరిగే కొద్దీ సహజంగానే మందగిస్తుంది. అయితే, సరైన జీవనశైలిని పాటిస్తే ఈ జీవక్రియను వేగవంతం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫోర్టిస్ హాస్పిటల్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ పవన్ కుమార్ గోయల్ మాట్లాడుతూ, “రోజువారీ అలవాట్లలో క్రమశిక్షణతో ఉంటే, మెటబాలిజంను సమర్థవంతంగా కాపాడుకోవచ్చు” అని పేర్కొన్నారు.
జీవక్రియను మెరుగుపరచుకోవడానికి 7 చిట్కాలు:
1. ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం: ఆరోగ్యకరమైన అల్పాహారం రోజును ఉత్సాహంగా ప్రారంభిస్తుంది. గుడ్లు, పన్నీరు, పాలు, మొలకెత్తిన గింజలు, నట్స్ మరియు పెరుగు వంటి ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. కార్బోహైడ్రేట్లు లేదా కొవ్వుల కంటే ప్రోటీన్‌ను జీర్ణం చేయడానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అంతేకాకుండా, ప్రోటీన్ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచి, అనవసరమైన స్నాక్స్ తినకుండా చేస్తుంది.
2. క్రమ తప్పని వ్యాయామం: మెటబాలిజంను మెరుగుపరచడానికి వ్యాయామం ఉత్తమ మార్గం. వారంలో కనీసం 30 నుండి 45 నిమిషాల పాటు వాకింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్, సైక్లింగ్, యోగా లేదా ఈత వంటి వ్యాయామాలు చేయాలి. ఇవి కండరాల బలాన్ని పెంచుతాయి. కండర ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తుంది.
3. ఎక్కువ సేపు కూర్చోకండి: ఒకే చోట ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం వల్ల కేలరీలు ఖర్చయ్యే వేగం తగ్గుతుంది. డెస్క్ జాబ్ చేసేవారు ప్రతి గంటకు ఒకసారి లేచి కాసేపు నడవండి. ఫోన్లో మాట్లాడేటప్పుడు నడవడం, లిఫ్ట్‌కు బదులుగా మెట్లు వాడటం వంటి చిన్న చిన్న మార్పులు రోజంతా శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుతాయి.
4. తగినంత నీరు తాగడం: శరీరంలోని జీవక్రియలకు నీరు అత్యంత అవసరం. శరీరంలో నీటి శాతం తగ్గితే అలసటగా, మందకొడిగా అనిపిస్తుంది. రోజంతా తగినంత నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా శక్తి స్థాయిలు పెరుగుతాయి.
5. నిద్రకు ప్రాధాన్యత: చాలామంది జీవక్రియలో నిద్ర పాత్రను విస్మరిస్తారు. ప్రతి వ్యక్తి ప్రతిరోజూ 7 నుండి 9 గంటల నాణ్యమైన నిద్ర పొందాలి. నిద్రలేమి ఆకలిని నియంత్రించే హార్మోన్లపై ప్రభావం చూపుతుంది, ఇది కాలక్రమేణా బరువు పెరగడానికి మరియు జీవక్రియ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
6. ఒత్తిడిని తగ్గించుకోవడం: దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి శరీరంలో ‘కార్టిసోల్’ (Cortisol) అనే హార్మోన్‌ను పెంచుతుంది. ఇది ఆకలిని ప్రేరేపించి బరువు పెరగడానికి కారణమవుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం (Meditation), శ్వాస వ్యాయామాలు, కుటుంబ సభ్యులతో గడపడం వంటివి చేయండి.
7. పౌష్టికాహారం: విటమిన్లు, ఖనిజాలు (Minerals) మరియు యాంటీ-ఆక్సిడెంట్లతో కూడిన ఆహారాన్ని ఎంచుకోండి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్ మరియు నట్స్‌ను ఆహారంలో చేర్చుకోండి. జంక్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు చక్కెర పానీయాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.
గమనిక: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. శరీరంలో ఏవైనా తీవ్రమైన మార్పులు లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

Leave a Reply