బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నవంబర్ 5న, బయలుదేరడానికి సరిగ్గా 30 నిమిషాల ముందు స్పైస్‌జెట్ విమానాన్ని అకస్మాత్తుగా రద్దు చేయడంతో, 35 మందికి పైగా ప్రయాణికులు విమానాశ్రయంలో ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులు పడిన ఘటన కలకలం రేపింది.
విమానం రద్దు చేసినట్లు ప్రకటించగానే ఆగ్రహానికి గురైన ప్రయాణికులు, అక్కడున్న స్పైస్‌జెట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ తారాస్థాయికి చేరుకున్న క్రమంలో, తీవ్ర కోపంతో ఉన్న ఓ మహిళా ప్రయాణికురాలు భద్రతా విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్ (CISF) జవాన్లతో గొడవ పడటమే కాకుండా, ఓ మహిళా స్పైస్‌జెట్ ఉద్యోగినిపై దాడి చేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.
‘బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుత పరిస్థితి ఇదే’ అనే క్యాప్షన్‌తో ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడి వైరల్‌గా మారుతోంది. చివరి నిమిషంలో ప్రయాణికులను నడిరోడ్డున పడేసిన స్పైస్‌జెట్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
అదే సమయంలో.. ‘విమానాల షెడ్యూల్‌ను నిర్ణయించే అధికారం కిందిస్థాయి ఉద్యోగులకు ఉండదు; వారు కేవలం తమ డ్యూటీ మాత్రమే చేస్తున్నారు. వారిపై దౌర్జన్యం ప్రదర్శించడం న్యాయం కాదు’ అని పలువురు నెటిజన్లు ఆ ఉద్యోగులకు మద్దతుగా గొంతెత్తుతున్నారు. ఈ ఆకస్మిక విమాన రద్దుకు గల అసలు కారణం, దాడికి సంబంధించిన పూర్తి వివరాలపై అధికారిక విచారణ కొనసాగుతోంది.

Leave a Reply