300 సినిమాలు.. అమితాబ్, గోవిందాతో నటన.. 5 పెళ్లిళ్లు, 12 ఎఫైర్లు.. కానీ చివరకు సోఫాపై కుళ్ళిన శవమై..!

సాధారణంగా ఒక బాలీవుడ్ నటుడు మరణిస్తే, అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చి నివాళులు అర్పిస్తారు. కానీ, 300కు పైగా సినిమాల్లో నటించి, వెండితెరపై మెరిసిన ఒక నటుడు మాత్రం ఎవరూ లేని ఒంటరితనంలో, అనామకుడిగా ప్రాణాలు విడిచారు.

ఆయనే మహేష్ ఆనంద్. 1990లలో అమితాబ్ బచ్చన్, గోవిందా, సునీల్ శెట్టి, అనిల్ కపూర్ వంటి దిగ్గజాలతో కలిసి నటించిన ఈయన చివరి రోజుల్లో మాత్రం చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. చివరకు ఆయన మరణించినప్పుడు శవాన్ని తీసుకెళ్లడానికి కూడా ఎవరూ రాలేదంటే ఆయన జీవితం ఎంత విషాదంగా ముగిసిందో అర్థం చేసుకోవచ్చు.

విలన్‌గా వెలిగిపోయిన కెరీర్
మహేష్ ఆనంద్ తన కెరీర్‌ను 1982లో కమల్ హాసన్, రీనా రాయ్ నటించిన “సనమ్ తేరీ కసమ్” సినిమాతో ప్రారంభించారు. ఆ తర్వాత 80, 90వ దశకాల్లో విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.

ప్రసిద్ధ చిత్రాలు: షహన్‌షా, గంగా జమున సరస్వతి, తూఫాన్, మజ్రిమ్, గుమ్రా, ఘర్ హో తో ఐసా వంటి హిట్ సినిమాల్లో నటించారు.

ఆయన చివరిగా 2019లో వచ్చిన “రంగీలా రాజా” సినిమాలో కనిపించారు. దురదృష్టవశాత్తు అదే ఏడాది ఆయన మరణించారు.

జీవితాన్ని మార్చేసిన ప్రమాదం
షహన్‌షా (1988) తర్వాత ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే, ఒక కారు ప్రమాదం ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. ఆరు నెలల పాటు ఇంటికే పరిమితం కావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఆయన భార్య, కుమారుడు త్రిశూల్ విదేశాలకు వెళ్ళిపోవడంతో మహేష్ ఆనంద్ ఒంటరివాడయ్యారు.

5 పెళ్లిళ్లు.. 12 అఫైర్లు
మహేష్ ఆనంద్ మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించారు. మంచి ఎత్తు, ఆకర్షణీయమైన రూపంతో మోడలింగ్‌లో రాణించి సినిమాల్లోకి వచ్చారు. అయితే ఆయన కెరీర్ కంటే వ్యక్తిగత జీవితమే ఎక్కువ చర్చల్లో ఉండేది.

మొదటి భార్య: నటి రీనా రాయ్ సోదరి బర్ఖా రాయ్. కొద్ది నెలలకే విడాకులు తీసుకున్నారు.

రెండవ భార్య: 1987లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ఎరికా మరియాను పెళ్లాడారు. వీరికి ‘త్రిశూల్’ అనే కొడుకు ఉన్నాడు. బాబు పుట్టిన కొన్ని నెలలకే విడిపోయారు.

మూడవ భార్య: 1992లో నటి మధు మల్హోత్రాను వివాహం చేసుకున్నారు. ఇది కూడా ఎంతో కాలం సాగలేదు.

నాల్గవ భార్య: నటి ఉషా బచానీని పెళ్లాడారు. కానీ కొద్ది నెలలకే విడాకులు అయ్యాయి.

ఐదవ భార్య: లానా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఇది కూడా త్వరగానే ముగిసింది.

వీరితో పాటు ఆయనకు సుమారు 12 మందితో అఫైర్లు ఉండేవని, కొందరితో లివింగ్ రిలేషన్‌లో కూడా ఉన్నారని ఆయన స్నేహితురాలు సాహిలా చద్దా తెలిపారు. ఇన్ని సంబంధాలు ఉన్నప్పటికీ, ఆయన చనిపోయినప్పుడు శవాన్ని తీసుకునేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు.

ఇంట్లో కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహం
2019లో మహేష్ ఆనంద్ తన నివాసంలో మరణించారు. ఆయన ఇంటి బయట కొన్ని రోజులుగా టిఫిన్ బాక్సులు పేరుకుపోవడం, లోపలి నుండి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా.. మహేష్ ఆనంద్ మృతదేహం సోఫాపై కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. ఆయన మరణించి అప్పటికే రెండు మూడు రోజులు అయి ఉంటుందని పోలీసులు నిర్ధారించారు.


Posted

in

by

Tags: