నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఎవరి వద్ద ఎక్కువ బంగారం ఉందనే పోటీ జరుగుతూనే ఉంది. ఏ దేశం వద్ద ఎక్కువ బంగారం ఉంటే, ప్రపంచ రాజకీయాల్లో ఆ దేశం హవా అంత ఎక్కువగా ఉంటుంది. అందుకే చైనా సహా పలు దేశాలు పోటీపడి బంగారం కొంటున్నాయి. అయితే, ప్రపంచ దేశాల బ్యాంకులు ఎంత బంగారం కొన్నా, భారతీయ కుటుంబాలను మించలేవన్నది అక్షర సత్యం.
భారతీయులకు సాంప్రదాయబద్ధంగా బంగారాన్ని పొదుపు చేసే అలవాటు ఉంది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని ఉన్నా.. ఒక సగటు భారతీయుడిని మీ వద్ద డబ్బుంటే ఏం కొంటారు? అని అడిగితే వెంటనే ‘బంగారం’ అని చెబుతారు. భారతీయ కుటుంబాల వద్ద దాదాపు 30,000 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వద్దే కేవలం 800 టన్నుల బంగారం ఉందంటే, మన ఇళ్లలో ఎంత బంగారం ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా, చైనా వంటి దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం కంటే భారతీయ ఇళ్లలోనే పెద్ద నిధి ఉంది. తాజాగా వెలువడిన ఒక సమాచారం ప్రకారం, భారతదేశ మొత్తం జిడిపి (GDP) కంటే భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం విలువే ఎక్కువట.
2025-2026 ఆర్థిక సంవత్సరానికి భారత నామినల్ జిడిపి విలువ 4.125 ట్రిలియన్ డాలర్లు కాగా, భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం విలువ 5 ట్రిలియన్ డాలర్లు. అంటే మన దేశ ఏడాది మొత్తం ఉత్పత్తి కంటే మన ఇళ్లలోని బంగారమే ఎక్కువ విలువైనది.
అయితే, ఇంత బంగారం ఉన్నా అది ఇళ్లలో లేదా బ్యాంక్ లాకర్లలోనే ముగిసిపోతోందని నిపుణులు అంటున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు (GDP growth) నేరుగా ఉపయోగపడటం లేదని, కేవలం అత్యవసర సమయంలో రుణాలు తీసుకోవడానికి మాత్రమే పనికొస్తోందని పీడబ్ల్యూసీ ఇండియా సీనియర్ అనలిస్ట్ రాణిన్ బెనర్జీ అభిప్రాయపడ్డారు.
