విశాఖపట్నం సమీపంలో జరిగిన ‘మిలన్ 2026’ అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల్లో, భారత నౌకాదళానికి చెందిన జలాంతర్గామిని (Submarine) ఫిలిప్పీన్స్ దేశపు యుద్ధనౌక ‘బీఆర్పీ మిగెల్ మల్వార్’ విజయవంతంగా గుర్తించి రికార్డు సృష్టించింది.
30కి పైగా దేశాలు పాల్గొన్న ఈ విన్యాసాల్లో, కేవలం ఫిలిప్పీన్స్ నౌక మాత్రమే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం గమనార్హం. భారత నౌకాదళం నిర్వహించిన ‘మిలన్ 2026’ ఉమ్మడి విన్యాసాల్లో అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాలతో సహా మొత్తం 33 యుద్ధనౌకలు పాల్గొన్నాయి. ఇందులో అత్యంత కఠినమైనదిగా భావించే ‘యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్’ (జలాంతర్గామి నిరోధక యుద్ధం) శిక్షణ సమయంలో, సముద్ర గర్భంలో దాగి ఉన్న భారత జలాంతర్గామిని ఫిలిప్పీన్స్కు చెందిన అత్యాధునిక క్షిపణి వాహక నౌక ‘మిగువెల్ మాల్వర్’ ఖచ్చితంగా గుర్తించింది.
దీనిపై ఫిలిప్పీన్స్ నౌకాదళ ప్రతినిధి రియర్ అడ్మిరల్ రాయ్ విన్సెంట్ ట్రినిడాడ్ మాట్లాడుతూ.. “విశాఖపట్నం సమీపంలో జరిగిన విన్యాసాల్లో పాల్గొన్న 33 యుద్ధనౌకల్లో, భారత జలాంతర్గామిని కనిపెట్టిన ఏకైక నౌక మా ‘మాల్వర్’ మాత్రమే. ఇది మా నౌకాదళం పెరుగుతున్న సామర్థ్యానికి నిదర్శనం. సముద్ర గర్భంలో శబ్దాలు వ్యాపించే విధానంలోని సూక్ష్మ వ్యత్యాసాలను గమనించి మా సిబ్బంది ఈ ఘనత సాధించారు” అని తెలిపారు.
ఫిలిప్పీన్స్ నౌకాదళం వద్ద ఉన్న సాంకేతికత ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా లేకపోయినప్పటికీ, సైనికుల వ్యక్తిగత నైపుణ్యం వల్ల ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. అత్యాధునిక పరికరాలపైనే పూర్తిగా ఆధారపడకుండా, సముద్రపు నీటి ప్రవాహాలు మరియు ధ్వని తరంగాలను గమనించే సిబ్బంది యొక్క చురుకైన తెలివితేటలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి.
గత ఫిబ్రవరి 17 నుండి 26 వరకు జరిగిన ఈ ‘మిలన్’ విన్యాసాల్లో ఫిలిప్పీన్స్ దేశం మొదటిసారిగా పాల్గొంది. మొదటి ప్రయత్నంలోనే భారత జలాంతర్గామి ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం ద్వారా, ఆసియా ప్రాంతంలో ఫిలిప్పీన్స్ నౌకాదళ ప్రాముఖ్యత పెరిగిందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.
