చైనాలో 35వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కిందపడినా ప్రాణాలతో బయటపడిన 27 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, సుమారు 17 నెలల పోరాటం తర్వాత మళ్లీ సోషల్ మీడియాలోకి అడుగుపెట్టింది.
చైనాలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన ‘వాన్ అనాన్’ అనే పేరుతో గుర్తింపు పొందిన ఈ యువతి, గత 2025 జూన్ నెలలో ఈ ప్రమాదానికి గురైంది. అంత ఎత్తు నుంచి పడినా ఆమె ప్రాణాలతో బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు సుమారు 14 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ తర్వాత 50 రోజులకు పైగా ఐసీయూ (ICU)లో చికిత్స పొందింది. శరీరంలోని పలు అవయవాలకు తీవ్ర గాయాలు కావడంతో వరుసగా అనేక శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. భవనం కింద ఉన్న చెట్లు, మొక్కలు ఆమె కిందపడే వేగాన్ని తగ్గించడం వల్లే ప్రాణాలతో బయటపడే అవకాశం కలిగినట్లు వైద్యులు తెలిపారు.
అయితే ఈ ప్రమాదంలో ఆమె కుడి కాలును తొలగించాల్సి వచ్చింది. చికిత్స తర్వాత స్పృహలోకి వచ్చినప్పుడు జరిగిన ఘటనకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు ఆమెకు గుర్తులేవని, మాట్లాడటంలోనూ ఇబ్బంది ఎదురైందని తెలిపారు. ఐసీయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తీవ్రమైన నొప్పి, శారీరక బలహీనత వంటి ఎన్నో సవాళ్లను ఆమె ఎదుర్కొంది. ఎన్నోసార్లు మానసికంగా కుంగిపోయినప్పటికీ, కుటుంబ సభ్యులు, వైద్య బృందం అందించిన ప్రోత్సాహంతో క్రమంగా కోలుకుంది.
2026 అక్టోబర్ 12వ తేదీన సుదీర్ఘ విరామం తర్వాత సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకుంటూ తాను మళ్లీ తిరిగి వచ్చినట్లు ప్రకటించింది. వైద్యులు, నర్సులు, కుటుంబ సభ్యులు, తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన ఆమె.. తనకు లభించిన ఈ పునర్జన్మను గౌరవిస్తూ జీవిస్తానని పేర్కొంది. ప్రస్తుతం వీల్‌చైర్ సహాయంతో బయటకు వెళ్లే స్థాయికి కోలుకున్న ఆమె, కృత్రిమ కాలు అమర్చుకుని తన జీవితాన్ని ముందుకు సాగించాలని నిర్ణయించుకుంది. ఈ పెను విషాదం నుంచి కోలుకుని తిరిగి నిలదొక్కుకున్న ఆమె ప్రయాణం ఇంటర్నెట్లో ఎందరినో ఆకట్టుకుంటోంది.

Leave a Reply