సాధారణంగా రిటైర్మెంట్ అంటే 60 ఏళ్లు దాటాలి. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యువత ‘ఫైర్’ (FIRE – Financial Independent, Retire Early) అనే కాన్సెప్ట్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే, తక్కువ వయసులోనే ఆర్థిక స్వాతంత్ర్యం పొంది రిటైర్ అవ్వడం.
డోనెగన్ దంపతుల సక్సెస్ స్టోరీ:
ఇంగ్లాండ్‌కు చెందిన అలెన్ డోనెగన్ (40), కేటీ (35) తమ 7 ఏళ్ల క్రితమే రిటైర్ అయ్యారు. వీరు అనుసరించిన ‘మితిమీరిన పొదుపు’ విధానం ఎంతోమందిని ఆశ్చర్యపరిచింది.
పొదుపు మంత్రం: అలెన్ తన ఆఫీసుకి ప్రతిరోజూ ఇంటి నుంచే లంచ్ బాక్స్ తీసుకెళ్లేవారు. ఇలా 10 ఏళ్లలో దాదాపు 40 వేల పౌండ్లు (సుమారు రూ. 51 లక్షలు) ఆదా చేశారు.
విద్యుత్ పొదుపు: కరెంటు బిల్లు ఆదా చేయడానికి ఫోన్ ఛార్జింగ్‌ను కూడా బయటే చేసేవారని, శీతాకాలంలో హీటర్ వాడకుండా ఎక్కువ దుస్తులు ధరించేవాళ్లమని వారు చెబుతారు.
పెట్టుబడులు: వీరిద్దరూ మంచి జీతాలు (అలెన్ రూ. 80 లక్షలు, కేటీ రూ. 74 లక్షలు) సంపాదించినప్పటికీ, విలాసాలకు వెళ్లకుండా ప్రతి పైసాను పెట్టుబడిగా మార్చారు. అలా వీరి పొదుపు రూ. 12 కోట్లకు చేరగానే, పనిని వదిలేశారు.
ఫైర్ (FIRE) మూవ్మెంట్ అంటే ఏమిటి?
“ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, రిటైర్ ఎర్లీ” అనేది ఈ ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. పనిచేస్తున్న కాలంలో చాలా కఠినమైన పొదుపు పాటించి, వీలైనంత త్వరగా ఆర్థిక స్వేచ్ఛను పొందడం దీని లక్ష్యం. గతంలో దీని గురించి తక్కువ మందికి తెలిసినా, ఇప్పుడు సోషల్ మీడియాలో దీనికి లక్షలాది మంది మద్దతుదారులు ఉన్నారు.
మింక్లీ అనుభవం:
అమెరికాకు చెందిన ఎమీ మింక్లీ (49) కూడా 44 ఏళ్లకే రిటైర్ అయ్యారు. ఆమె జపాన్, సింగపూర్, ఇండియా వంటి దేశాల్లో పనిచేశారు. ఖర్చును తగ్గించుకోవడానికి ఇండియాలో ఉన్నప్పుడు షేర్డ్ అకామోడేషన్ (ఇతరులతో కలిసి ఉండటం), కార్లు కొనకపోవడం వంటివి చేశారు. ఇప్పుడు ఆమె ఇండోనేషియాలోని బాలిలో హాయిగా జీవిస్తున్నారు.
