బ్రిటన్లో ఆన్లైన్ ద్వారా ఎస్కార్ట్ (సెక్స్ వర్కర్) సేవలు అందిస్తామంటూ ప్రకటనలు ఇచ్చి, కస్టమర్ల ఇళ్లకు వెళ్లి వారికి బలమైన మత్తుమందు ఇచ్చి నగదు, విలువైన వస్తువులను దోచుకుంటున్న రొమేనియాకు చెందిన ఒక కిలాడీ జంటకు న్యాయస్థానం ఒక్కొక్కరికి 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
రొమేనియాకు చెందిన అదినా మిహై (31), ఆమె ప్రియుడు మడలిన్ దుమిత్రూ (30) అనే ఇద్దరూ సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ నేర మార్గాన్ని ఎంచుకున్నారు. 35 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న పురుషులను టార్గెట్ చేస్తూ అదినా ఆన్లైన్లో ఎస్కార్ట్ సర్వీస్ ప్రకటనలు ఇచ్చేది. క్లయింట్ల నుంచి కాల్ రాగానే ఆమె ఒంటరిగా వారి ఇళ్లకు వెళ్లేది; ప్రియుడు దుమిత్రూ తుపాకీతో కారులో బయట కాపలా ఉండేవాడు.
కస్టమర్ల ఇంటికి వెళ్లాక వారితో మద్యం తాగే సమయంలో.. గ్లాసులో అత్యంత ప్రమాదకరమైన GBL అనే మత్తు రసాయనాన్ని కలిపేది. వారు స్పృహ కోల్పోగానే ప్రియుడిని లోపలికి పిలిపించి బీరువాల్లోని నగదు, బంగారం, రోలెక్స్ వాచీలు వంటి ఖరీదైన వస్తువులను ఊడ్చేసి అక్కడి నుంచి పారిపోయేవారు.
ఈ రసాయన మోతాదు ఎక్కువై గ్యారీ మౌవాట్ (37), మాల్కమ్ కింగ్ (80) అనే ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఘటనా స్థలంలో వైన్ గ్లాసులపై లభించిన వేలిముద్రల ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కోర్టులో నేరం రుజువు కావడంతో ఆ కిలాడీ జంటకు 17 సంవత్సరాల చొప్పున కఠిన కారాగార శిక్ష పడింది.
