ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పాలనా కాలంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రయాణాల కోసం ఉపయోగించిన విలాసవంతమైన బోయింగ్ 747 (Boeing 747) రకం విమానాన్ని ప్రస్తుతం అమ్మకానికి ప్రకటించారు.
దీని ధరను 9 లక్షల అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.8 కోట్లు. ఇరాక్ ప్రభుత్వానికి చెందిన విమానయాన సంస్థ ‘ఇరాక్ ఎయిర్‌వేస్’ ఈ విక్రయ ప్రక్రియను చేపట్టింది.
1982లో అమెరికాలో తయారైన ఈ విమానాన్ని ముఖ్య ప్రముఖుల (వీఐపీల) ప్రయాణాల కోసం ప్రత్యేక సదుపాయాలతో రూపొందించారు. ఇందులో ప్రత్యేక పడకగది, సమావేశాలు నిర్వహించుకునే గది, విలాసవంతమైన లాంజ్ తదితర సౌకర్యాలు ఉన్నట్లు సమాచారం. సద్దాం హుస్సేన్ స్వయంగా ఈ విమానంలో ప్రయాణించినట్లు అధికారికంగా ధృవీకరించనప్పటికీ, ఆయన పాలనలో ప్రభుత్వ వీఐపీ విమానంగా దీనిని ఉపయోగించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
1990లో ఇరాక్, కువైట్‌పై దాడి చేయడంతో గల్ఫ్ యుద్ధ ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల వైమానిక దాడుల నుండి విమానాలను రక్షించుకునే ఉద్దేశంతో, 1991 జనవరిలో ఇరాక్‌కు చెందిన రెండు బోయింగ్ 747 విమానాలను ట్యునీషియాకు పంపించారు. అక్కడి టోజర్-నెఫ్టా (Tozeur-Nefta) అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిపి ఉంచిన ఆ విమానాలు, 35 ఏళ్లకు పైగా అక్కడే ఉన్నాయి.
ప్రస్తుతం ఈ విలాసవంతమైన విమానంతో పాటు మరో బోయింగ్ 747 విమానాన్ని కూడా ఒక్కొక్కటి 9 లక్షల డాలర్ల ధరకు విక్రయించాలని ఇరాక్ నిర్ణయించింది. ఆసక్తి గలవారు డిసెంబర్ 21, 2026 నుండి జనవరి 5, 2027 వరకు వేలం ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఎంపికైన కొనుగోలుదారులు 20 శాతం అడ్వాన్స్‌గా 1.8 లక్షల డాలర్లు చెల్లించాలి. విమానాలు ప్రస్తుతం ఉన్న స్థితిలోనే విక్రయించబడుతున్నందున, వాటి సాంకేతిక నాణ్యతకు ఎటువంటి గ్యారంటీ ఉండదు. రవాణా, కస్టమ్స్ సుంకం తదితర అదనపు ఖర్చులను కూడా కొనుగోలుదారులే భరించాల్సి ఉంటుంది.

Leave a Reply