జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో ప్రాంతంలో జరిగిన ఓ ఫుట్బాల్ మ్యాచ్లో తోటి ఆటగాడితో అనుకోకుండా ఢీకొన్న 37 ఏళ్ల క్రీడాకారుడు మైదానంలోనే కుప్పకూలి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
బొకారో థర్మల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో ‘బజరంగ్ క్లబ్’ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు డే-నైట్ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో గోమియా ప్రాంతానికి చెందిన గజ్రా ముర్ము అనే 37 ఏళ్ల ఆటగాడు కూడా ఉత్సాహంగా పాల్గొని ఆడాడు.
మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో, గజ్రా ముర్ము అనుకోకుండా ప్రత్యర్థి జట్టు ఆటగాడిని బలంగా ఢీకొన్నాడు. ఢీకొన్న మరుక్షణమే అతను మైదానంలోనే కుప్పకూలి స్పృహ తప్పి పడిపోయాడు.
ఇది చూసి షాక్కు గురైన తోటి ఆటగాళ్లు, నిర్వాహకులు వెంటనే అతడిని రక్షించి సమీపంలోని డీవీసీ (DVC) ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స అందించినప్పటికీ, చికిత్స ఫలించక అర్ధరాత్రి సమయంలో అతను ప్రాణాలు విడిచాడు.
ఆటగాడి ఆకస్మిక మరణ వార్త విని ఆసుపత్రికి చేరుకున్న బంధువులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆట స్థలంలో జరిగిన ఈ విషాద ఘటన ఆ ప్రాంత ప్రజల్లోనూ, తోటి క్రీడాకారుల్లోనూ విషాద ఛాయలు నింపింది.

Leave a Reply