దక్షిణ కొరియాలో జాతీయ స్థాయిలో నిర్వహించిన పన్నుల అకౌంటెంట్ అర్హత పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచిన ఓ అభ్యర్థి, ఆ విజయం వెనుక అక్రమ మార్గాన్ని ఉపయోగించినట్లు అంగీకరించడం తీవ్ర కలకలం రేపుతోంది. పరీక్ష హాల్లో రహస్య కెమెరా ద్వారా ప్రశ్నపత్రాన్ని ఫొటోలు తీసి, వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి పంపించి సమాధానాలు పొందినట్లు అతడు వెల్లడించాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్, జూలై నెలల్లో నిర్వహించిన ఈ అర్హత పరీక్ష రెండు దశల్లోనూ 34 ఏళ్ల హాన్ అనే వ్యక్తి అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. ముఖ్యంగా తొలి దశ పరీక్షలో మొత్తం 400 మార్కులకు గానూ ఏకంగా 397.5 మార్కులు సాధించాడు. దీంతో అతడి ప్రతిభపై అందరి దృష్టి పడింది.
అయితే, ఈ అద్భుతమైన ఫలితాల వెనుక అసలు విషయం బయటపడటంతో అందరూ షాక్కు గురయ్యారు. పరీక్ష హాల్లోకి చిన్న రహస్య కెమెరాను తీసుకెళ్లిన హాన్.. ప్రశ్నపత్రాలను ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను ఏఐ సాంకేతికతకు పంపించి సమాధానాలు పొందాడు. అనంతరం తన స్మార్ట్ఫోన్లో ఆ సమాధానాలను చూసుకుంటూ పరీక్ష రాసినట్లు అంగీకరించాడు.
తన న్యాయవాది నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్లో విడుదలైన వీడియోలో హాన్ ఈ విషయాలను స్వయంగా వెల్లడించాడు. రెండు దశల పరీక్షల్లోనూ ఎలక్ట్రానిక్ పరికరాలు, ఏఐ సాయంతో అక్రమాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. తన చర్యకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ.. ఇది నిజాయితీగా కష్టపడి సాధించిన విజయం కాదని అంగీకరించాడు. ఈ వ్యవహారంపై సియోల్ పోలీసులకు లిఖితపూర్వక వాంగ్మూలం కూడా ఇచ్చాడు.
ఈ ఘటనతో దక్షిణ కొరియాలో జాతీయ స్థాయి అర్హత పరీక్షల నిర్వహణ, భద్రతపై తీవ్ర చర్చ మొదలైంది. ముఖ్యంగా రాబోయే విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షల్లో ఇలాంటి అక్రమాలు జరగకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. స్మార్ట్ గ్లాసెస్ వంటి ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంపై నిఘా పెంచడంతో పాటు పరీక్ష కేంద్రాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
సాంకేతికతను ఉపయోగించి ప్రతిభను పెంచుకోవాల్సింది పోయి.. అదే సాంకేతికతను అడ్డుపెట్టుకుని పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే చివరకు ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని ఈ ఘటన చర్చకు దారితీస్తోంది.

Leave a Reply