సోషల్ మీడియా వేదికలు మనుషులను దగ్గర చేయడంతో పాటు కొన్ని సమయాల్లో తీవ్ర ప్రమాదాల్లోకి నెట్టేస్తాయనడానికి నిదర్శనంగా చెన్నైలో ఒక సంఘటన చోటుచేసుకుంది.
ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై, సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన ప్రైవేట్ ఫోటోలను చూపిస్తూ యువతిని బ్లాక్మెయిల్ చేసిన మాజీ ప్రియుడిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.
విల్లుపురం జిల్లాకు చెందిన అమీర్ సుహైల్ (28) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇన్స్టాగ్రామ్ ద్వారా చెన్నైకి చెందిన విడాకులు తీసుకున్న ఒక యువతితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం క్రమంగా ప్రేమగా మారి, గత నాలుగేళ్లుగా ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడుకుంటూ వచ్చారు. వీరిద్దరూ నేరుగా కలుసుకుని చాలా సన్నిహితంగా కూడా గడిపారు.
ఈ క్రమంలో అమీర్ సుహైల్ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాడు. విదేశాల్లో ఉన్నప్పటికీ ఆమెతో సంభాషణలు కొనసాగించాడు. అయితే పరిస్థితుల రీత్యా ఆ యువతి రెండో వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. దీంతో తనను ఇకపై సంప్రదించవద్దని, పాత జ్ఞాపకాలను మర్చిపోవాలని అమీర్ సుహైల్‌కు స్పష్టం చేసింది.
కానీ దీనికి అంగీకరించని నిందితుడు.. “నిన్ను నేను మర్చిపోలేను, నాతో సంబంధాన్ని తెంచుకోకూడదు” అంటూ నిరంతరం బలవంతం చేస్తూ వేధించసాగాడు. ఈ క్రమంలో విదేశాల నుంచి చెన్నైకి తిరిగివచ్చిన అతను ఆ యువతిని నేరుగా కలిశాడు.
ఆ సమయంలో తన లైంగిక కోరికను తీర్చాలని, లేదంటే తాము సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ప్రైవేట్ ఫోటోలను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. అన్నట్లుగానే కొన్ని ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, అమీర్ సుహైల్‌కు మరికొందరు మహిళలతో కూడా ఇలాంటి సంబంధాలు ఉన్నాయనే నిజం ఆ యువతికి తెలిసింది. దీంతో తీవ్ర అసహ్యానికి గురైన ఆమె ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అమీర్ సుహైల్‌ను గుర్తించి మొన్న అరెస్టు చేశారు. ఇన్స్టాగ్రామ్ ప్రియుడి ఈ వికృత చేష్టలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి.

Leave a Reply