4 గురు కొడుకులను కన్న ఒక తల్లికి ఇటువంటి పరిస్థితా…? తల్లి చనిపోయినప్పుడు ఒక్క కొడుకు కూడా రాలేదా…? చివరి సంస్కారాలు చేయడానికి కూడా ఎవరికీ మనసొప్పలేదా…? ఈ ఘటన గురించి వింటే ఎవరి మనసు మాత్రం విలవిలలాడదు…?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో నలుగురు కొడుకులు ఉన్నప్పటికీ, మరణించిన తల్లి అంతిమ సంస్కారాల్లో వారు ఎవరూ పాల్గొనకపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

రెసిడెన్సీ ప్రాంతంలో నివసించే లతా భాయి తన జీవితకాల పొదుపు, నగలనుమ్మి ఒక ఇల్లు (అపార్ట్‌మెంట్) కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె కొడుకుల్లో ఒకరు ఆ ఇంటిని తన పేరు మీదకు మార్చుకుని, లతా భాయిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టినట్లు సామాజిక సంస్థ ప్రతినిధులు తెలిపారు.

వృద్ధాప్యంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న లతా భాయి గురించి ‘ప్రియు ఫౌండేషన్’కు చెందిన అజయ్ నాగ్దాకు సమాచారం అందింది. దీంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి ‘జానకి వృద్ధాశ్రమం’లో చేర్పించారు. అక్కడ దాదాపు 8 నెలల పాటు ఆమెను సంరక్షించారు. ఈ సమయంలో సామాజిక సంస్థల ప్రతినిధులే ఆమెకు అవసరమైన సహాయాన్ని అందించినట్లు పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో లతా భాయిని ఇండోర్‌లోని ఎం.వై. ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఆమె మరణం గురించి ‘ఓం శాంతి ఆశ్రమం’కు చెందిన బ్రహ్మకుమారి జ్యోతి దీదీ ద్వారా నలుగురు కొడుకులకు సమాచారం అందించినట్లు సమాచారం. అయితే సమాచారం ఇచ్చినప్పటికీ వారిలో ఎవరూ అంతిమ సంస్కారాలకు రాలేదని, కనీసం చితికి నిప్పు పెట్టడానికి కూడా నిరాకరించారని సామాజిక కార్యకర్తలు తెలిపారు.

దీంతో ‘ప్రియు ఫౌండేషన్’, ‘జానకి వృద్ధాశ్రమం’ సంయుక్తంగా లతా భాయి అంతిమ సంస్కారాలను నిర్వహించాయి. రీజినల్ పార్క్ ప్రాంతంలో ఆమె పార్థివ దేహానికి శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు పూర్తి చేశారు. జీవితాంతం పిల్లల కోసమే బతికిన తల్లికి, చివరి ప్రయాణంలో సొంత కొడుకుల ఆసరా దక్కకపోవడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అదే సమయంలో, చివరి నిమిషంలో ఆమెను ఒంటరిగా వదిలేయకుండా అంతిమ సంస్కారాలు పూర్తి చేసిన సామాజిక సంస్థల చొరవ పలువురి ప్రశంసలు అందుకుంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *