కేరళకు చెందిన ఓ వ్యక్తి, రైలు బయలుదేరడానికి 4 గంటల లోపు టికెట్ కన్ఫర్మ్ అయినట్లు మెసేజ్ రావడంతో, దాన్ని రద్దు (క్యాన్సిల్) చేసుకునే అవకాశం లేక డబ్బులు కోల్పోయాడు.
దీనిపై ఆయన తిరువనంతపురం జిల్లా వినియోగదారుల కోర్టును (Consumer Court) ఆశ్రయించగా, దక్షిణ రైల్వే సేవల్లోని లోపాన్ని ఎత్తిచూపుతూ ఆయనకు ₹19,700 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
బాధిత వ్యక్తి తన కుమార్తె న్యూఢిల్లీ ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న రైలు 3rd AC, స్లీపర్ క్లాస్‌లలో టికెట్లు బుక్ చేశాడు. రైలు బయలుదేరడానికి కొన్ని గంటల ముందు వరకు కూడా టికెట్ కన్ఫర్మ్ కాకపోవడంతో, ప్రత్యామ్నాయంగా విమానంలో వెళ్లాలని నిర్ణయించుకుని ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. కానీ, ఫ్లైట్ టికెట్ తీసుకున్న తర్వాత.. రైలు బయలుదేరడానికి 4 గంటల లోపు టికెట్ కన్ఫర్మ్ అయినట్లు దక్షిణ రైల్వే నుంచి అతనికి మెసేజ్ వచ్చింది.
నిబంధనల ప్రకారం రైలు బయలుదేరడానికి 4 గంటల ముందే క్యాన్సిల్ చేయనందున, ఆయనకు టికెట్ రుసుము ₹6,700 తిరిగి (రీఫండ్) ఇవ్వలేమని రైల్వే యంత్రాంగం నిరాకరించింది. దీనిపై విచారణ చేపట్టిన వినియోగదారుల కోర్టు.. 4 గంటల లోపు కన్ఫర్మేషన్ మెసేజ్ పంపి, క్యాన్సిల్ చేసుకునేందుకు తగిన సమయం ఇవ్వకుండా డబ్బులు నిరాకరించడం రైల్వే సేవా లోపమేనని స్పష్టమైన తీర్పు ఇచ్చింది.
దీంతో, బాధిత వ్యక్తికి టికెట్ ఛార్జీలు ₹6,700, మానసిక క్షోభకు పరిహారంగా ₹10,000, అలాగే కోర్టు ఖర్చుల నిమిత్తం ₹3,000 కలుపుకుని మొత్తం ₹19,700 చెల్లించాలని దక్షిణ రైల్వేను ఆదేశించింది. అంతేకాకుండా, ఈ వ్యవహారంలో ఐఆర్సీటీసీ (IRCTC) సంస్థ తప్పేమీ లేదని కోర్టు స్పష్టం చేసింది.

Leave a Reply