ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలన వచ్చాక మహిళల జీవన విధానం, స్వేచ్ఛ పూర్తిగా అణచివేతకు గురైన పరిస్థితుల్లో.. భర్త పెడుతున్న చిత్రహింసల నుంచి విముక్తి కోరుతూ 18 ఏళ్ల యువతి చేసిన ఆర్తనాదం ప్రపంచాన్ని కలచివేస్తోంది.
దేశ ఉత్తర ప్రాంత గవర్నర్ అబ్దుల్లా సర్హాదీ కార్యాలయానికి ముఖాన్ని బురఖాతో కప్పుకుని వచ్చిన ఆ యువతి, గత కొద్ది నెలలుగా తన భర్త తనపై చేస్తున్న శారీరక దాడులు, నిరంతరం ఇస్తున్న బెదిరింపుల గురించి కన్నీటితో వివరించింది.
ఈ నరకం నుంచి బయటపడేందుకు తనకు వెంటనే విడాకులు ఇప్పించాలని ఆమె వేడుకుంది. అయితే, ఆ యువతి ఆవేదనను ఏమాత్రం పట్టించుకోని ఆ గవర్నర్.. విడిపోయే నిర్ణయాన్ని విరమించుకుని తిరిగి భర్తతోనే కలిసి జీవించాలని ఆదేశించాడు.
అంతేకాకుండా, విడాకులు ఇవ్వడానికి భర్త డిమాండ్ చేస్తున్న భారీ మొత్తాన్ని (4 రెట్లు ఎక్కువ సొమ్ము) చెల్లించే స్థోమత తమకు లేదని యువతి బంధువులు తేల్చిచెప్పడంతో.. ఆమెకు ఇంట్లో ఓ ప్రత్యేక గది కేటాయించాలని, ఇకపై ఆమెను కొట్టవద్దని మాత్రమే భర్తకు ఆ గవర్నర్ చెప్పాడు. అంతటితో ఆగకుండా, “మహిళలకు విచక్షణా జ్ఞానం తక్కువ” అంటూ వారిని కించపరిచేలా మాట్లాడిన ఆ అధికారి.. బాధితురాలికి ఎలాంటి న్యాయం చేయకుండా వెనక్కి పంపించేశాడు.
గత కొన్నేళ్లుగా ఆఫ్ఘనిస్తాన్లో అమలవుతున్న కఠిన చట్టాల వల్ల మహిళల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు మరియు ప్రాథమిక స్వేచ్ఛ పూర్తిగా హరించుకుపోయాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో, న్యాయం కోసం ప్రభుత్వాధికారిని ఆశ్రయించినా ఏమాత్రం ఫలితం దక్కని మహిళల నిస్సహాయ స్థితిని ఈ ఘటన మరోసారి ప్రపంచం ముందుంచింది.

Leave a Reply