రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న నేపథ్యంలో, యుద్ధాన్ని ముగించే విషయమై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక ప్రకటన చేశారు.
ప్రస్తుతం యుద్ధ సరిహద్దులు ఎక్కడైతే ఉన్నాయో, అక్కడే బలగాలను నిలిపివేసి యుద్ధాన్ని ముగించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ భూభాగాలను వదులుకోవడానికి ఆయన పరోక్షంగా అంగీకరించారా అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీని.. “ప్రస్తుత పరిస్థితుల్లో, అంటే ఉక్రెయిన్ తన దేశంలోని 75 శాతం భూభాగాన్ని మాత్రమే తన ఆధీనంలో ఉంచుకున్న తరుణంలో శాంతి ఒప్పందాన్ని అంగీకరించడానికి సిద్ధమేనా?” అని ప్రశ్నించారు. దానికి ఆయన బదులిస్తూ.. “అవును, ఈ యుద్ధాన్ని ముగించడానికి ఇదే ఆచరణాత్మకమైన మార్గం. దీనిని కాల్పుల విరమణ అనవచ్చు లేదా డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లుగా ప్రాణనష్టాన్ని అడ్డుకోవడం అని కూడా చెప్పుకోవచ్చు” అని పేర్కొన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. “ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా నుంచి మిగిలిన ప్రాంతాలను కాపాడుకోవడం చాలా అవసరం. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఐరోపా దేశాల వద్దకు వెళ్లి మాకు తగిన భద్రతా హామీలను కోరతాం” అని అన్నారు. అంతేకాకుండా, యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌కు చెందిన 95 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను కోల్పోయి విదేశాల్లో నివసిస్తున్నారని, వారంతా మాతృభూమికి తిరిగి వచ్చి దేశాన్ని మళ్లీ నిర్మించుకోవాలన్నదే తన ప్రధాన లక్ష్యమని ఆయన కన్నీళ్లతో తెలిపారు.

Leave a Reply