నటుడు జయం రవి (రవి మోహన్) తో ముడిపెడుతూ తనపై జరుగుతున్న సైబర్ దాడులపై గాయిక కేనీషా ఫ్రాన్సిస్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో పంచుకున్న సుదీర్ఘ వీడియోల ద్వారా ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. తాను ఎవరి కుటుంబాన్ని ముక్కలు చేయలేదని, జీవితంలో కుంగిపోయిన ఒక స్నేహితుడికి అండగా మాత్రమే నిలబడ్డానని ఆమె పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ నిజం తెలుసని కేనీషా చెప్పారు.
నా చిన్నతనం అత్యంత క్రూరమైనది:
“నా చిన్నతనం చాలా భయంకరంగా సాగింది. నేను అమ్మానాన్నలకు ఒక్కతే కూతురిని. 2013లో అమ్మ, 2017లో నాన్న చనిపోయారు. నాకు నాలుగు ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచే నా కుటుంబంలోని పలువురు పురుషులు నన్ను లైంగికంగా వేధించారు. 18 ఏళ్ల వయస్సులోనే నాకు పెళ్లి చేశారు. ఆ వయస్సులో ఒక అమ్మాయికి కావాల్సింది పెళ్లి కాదు. ఆ బంధం కేవలం నాలుగు నెలలు మాత్రమే నిలిచింది. ఆ వ్యక్తికి పది మందికి పైగా ప్రియురాళ్లు ఉండేవారు. నేను నిరంతరం వేధింపులకు గురయ్యాను. ఆ హింస కారణంగా నా గర్భంలో ఉన్న బిడ్డను కోల్పోయాను. అప్పుడు నా వయస్సు కేవలం 19 ఏళ్లు.
తర్వాత అమ్మను కోల్పోయాను. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న నాన్నను నాలుగేళ్ల పాటు సేవలు చేస్తూ చూసుకున్నాను. గత పదేళ్లుగా ఒంటరిగానే జీవిస్తున్నాను. కేనీషా ఎవరి సిఫార్సుతోనో ఇక్కడికి రాలేదు. బార్లలో 500 రూపాయల కోసం పాటలు పాడుతూ నా కెరీర్ ప్రారంభించాను. అందులో నాకేమీ తప్పుగా అనిపించదు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి పునాది అదే.
గత కొన్ని నెలలుగా నాపై అసత్య ప్రచారాలు చేసేవారు బెంగళూరుకు డిటెక్టివ్‌లను పంపారు. నేను ఎవరిని పెళ్లి చేసుకున్నాను అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నా తండ్రిని నేను ఎక్కడో దాచి ఉంచానని అంటున్నారు. నన్ను చూస్తుంటే తల్లిదండ్రులను వద్దనుకునే దానిలా కనిపిస్తున్నానా? అనాథగా ఉండటాన్ని ఎవరూ ఇష్టపడరు. ఇన్నాళ్లు నేను మౌనంగా ఉన్నాను. చట్టాన్ని నమ్మమని నాకు చెప్పారు. నేను ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. కన్నబిడ్డను కోల్పోయిన నేను, మరొకరిని వారి బిడ్డకు దూరం చేస్తానని అనుకుంటున్నారా?”
కోర్టు నోటీసుల వార్తలు అబద్ధం:
“తమిళ మీడియాలో నాకు కోర్టు నోటీసులు అందాయని వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధం. ఆ నోటీసు చూడకుండానే వార్తలు ఎలా రాస్తారు? నాకు అలాంటి నోటీసు ఏదీ అందలేదు. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. హ్యాక్ చేసిన వారు బాట్లను ఉపయోగించి మెసేజ్‌లు పంపారు. అవి నా సమాధానాలు కావు. హ్యాక్ చేసింది ఎవరో కనుగొన్నాము.
మానసికంగా కుంగిపోయిన ఒక వ్యక్తి సహాయం కోరి వచ్చినప్పుడు, ఒక థెరపిస్ట్‌గా అతనికి మానసిక మద్దతు ఇచ్చాను. కుటుంబం, స్నేహితులను దాటి ఒకరు సహాయం కోసం వస్తున్నారంటే వారు ఎంతటి మానసిక క్షోభను అనుభవిస్తున్నారో ఊహించవచ్చు. ప్రతి ఒక్కరికీ తమ నిర్ణయాలు తీసుకునే పరిణతి ఉంటుంది.
అతను (జయం రవి) అనుభవించిన మానసిక వేదన అతన్ని తన కుటుంబానికి పూర్తిగా దూరం చేసింది. ఆ పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని కలపడానికి నేను ఏమీ చేయలేను. ఎవరినీ మోసం చేయవద్దని, అబద్ధాలు చెప్పవద్దని, అర్హత లేని దాని కోసం ఆశపడకూడదని నా తల్లిదండ్రులు నేర్పించారు. కాబట్టి ఎవరి కుటుంబాన్ని పాడు చేయాలనే ఉద్దేశ్యం నాకు లేదు.
మేము ఎక్కడికీ పారిపోలేదు, మీ కళ్లముందే ఉన్నాము. అక్కడ ఏం జరిగిందో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. రవి మోహన్‌తో కలిసి నేను చాలా చోట్ల ప్రయాణించాను. చాలా మంది వచ్చి నా చేతులు పట్టుకుని, అతన్ని కాపాడినందుకు, అతని ముఖంలో మళ్లీ నవ్వు తెచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఒక స్నేహితుడికి సహాయం చేసినందుకు నన్ను వేధిస్తారా? అన్నింటికీ తీర్పు చెప్పే రోజు ఒకటి వస్తుంది. ఇది కలియుగం. కర్మ ఎక్కడికీ పోదు.”
