బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన కేసులో దాదాపు 15 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న 72 ఏళ్ల వృద్ధుడిని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం (స్పెషల్ సెల్) ఎట్టకేలకు అరెస్ట్ చేసింది.
రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన హరి సింగ్ షెకావత్ అనే ఈ వ్యక్తిని న్యాయస్థానం గతంలోనే మోస్ట్ వాంటెడ్ నేరస్థుడిగా ప్రకటించింది.
ఈ కేసు 2008 నాటి ఘటనకు సంబంధించినది. అప్పట్లో షెకావత్ తాను పనిచేసిన ఒక ప్రముఖ బహుళజాతి గార్మెంట్స్ (MNC) కంపెనీని బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేయడానికి యత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. కేసు నమోదైన తర్వాత కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా నిరంతరం పరారీలో ఉండటంతో, 2016లో కోర్టు అతడిని వాంటెడ్ నిందితుడిగా ప్రకటించింది.
పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అతడు ఢిల్లీ నుంచి గుజరాత్, ఆ తర్వాత రాజస్థాన్‌కు తరచూ నివాసాలు మారుస్తూ అజ్ఞాతంలో బతికాడు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు లోతైన క్షేత్రస్థాయి విచారణ, నిఘా ఆధారంగా చివరకు అతడు జైపూర్‌లోని ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో దాక్కున్నట్లు పక్కాగా గుర్తించారు.
అరెస్టయిన హరి సింగ్ షెకావత్ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ XLRI పూర్వ విద్యార్థి కావడం, పలు ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీలలో ఉన్నత పదవుల్లో పనిచేసి ఉండటం గమనార్హం.
ఢిల్లీ, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ వంటి నాలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ కాలంగా సాగిన పోలీసుల వేట.. జైపూర్‌లో అతడిని మెరుపుదాడితో అరెస్ట్ చేయడంతో ఎట్టకేలకు ముగిసింది.

Leave a Reply