ఛత్తీస్గఢ్ రాష్ట్రం ధమ్తరి జిల్లాలో ప్రార్థనా సమావేశాలు, మతమార్పిడులకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో.. చర్చిలు, ప్రార్థనా మందిరాల ప్రవేశ ద్వారాల వద్ద ప్రత్యేక నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 40 చర్చిలు, ప్రార్థనా స్థలాల వద్ద ఇలాంటి బోర్డులు పెట్టినట్లు క్రైస్తవ సంఘం తెలిపింది. అయితే, ధమ్తరి నగరంలోని 8 చర్చిల వద్ద మాత్రమే ఈ బోర్డులు ఏర్పాటు చేసినట్లు కొన్ని వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.
చర్చి యాజమాన్య నిబంధనల ప్రకారం ప్రార్థనల నిమిత్తం చర్చి భవనంలోకి క్రైస్తవుల ప్రవేశానికి సంబంధించిన నియమాలను ఆ బోర్డులలో పొందుపరిచినట్లు సమాచారం. దీనిపై క్రైస్తవ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ డైమండ్ ఫిలిప్స్ మాట్లాడుతూ.. ప్రార్థనా సమావేశాలకు బయటి వ్యక్తులు రావడం వల్ల కొన్ని చోట్ల సమస్యలు తలెత్తాయని, తమ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు.
మరోవైపు, ప్రార్థనా సమావేశాల్లో పాల్గొనడం, మతమార్పిడికి సంబంధించి సుమారు 1,500 దరఖాస్తులు అధికారులకు అందాయని క్రైస్తవ సంఘం పేర్కొంది. అయితే ఈ సంఖ్యను జిల్లా యంత్రాంగం పూర్తిగా ధృవీకరించలేదు. దీనికి సంబంధించి తమ వద్ద ప్రత్యేక రికార్డులు లేవని, అసలు ఇన్ని దరఖాస్తులు వచ్చిన విషయం తమ దృష్టికి రాలేదని ధమ్తరి జిల్లా అధికారులు తెలిపినట్లు వార్తల్లో పేర్కొన్నారు.
ధమ్తరిలో ప్రార్థనా సమావేశాల విషయమై హిందూ సంఘాలు, క్రైస్తవ సంఘాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రలోభాలకు గురిచేసి మతమార్పిడులకు పాల్పడుతున్నారని కొన్ని హిందూ సంఘాలు ఆరోపిస్తుండగా, క్రైస్తవ సంఘాలు వాటిని ఖండిస్తున్నాయి. ఈ క్రమంలో పరిస్థితిపై చర్చించేందుకు శాంతి కమిటీ సమావేశం కూడా నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అధికార యంత్రాంగం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది.

Leave a Reply