ఇరాన్ – అమెరికా – ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. హిందూ మహాసముద్రంలోని అమెరికాకు చెందిన అత్యంత ముఖ్యమైన సైనిక స్థావరం ‘డియాగో గార్సియా’ (Diego Garcia) పై ఇరాన్ క్షిపణి దాడికి ప్రయత్నించినట్లు అంతర్జాతీయ రాజకీయాల్లో కలకలం రేగుతోంది.
అసలేం జరిగింది? ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ నివేదిక ప్రకారం.. ఇరాన్ తన సరిహద్దుల నుండి సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న డియాగో గార్సియా లక్ష్యంగా రెండు మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇందులో ఒక క్షిపణి గాలిలోనే విఫలమై పడిపోగా, రెండో దానిని అమెరికా యుద్ధనౌక ‘SM-3’ రకపు క్షిపణి ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఆ క్షిపణి పూర్తిగా ధ్వంసమైందా లేదా అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు.
ఇరాన్ వ్యూహం – క్షిపణి శక్తి: గత నెలలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చీ మాట్లాడుతూ.. తాము తమ క్షిపణుల పరిధిని 2,000 కిలోమీటర్లకు తగ్గించుకున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు 4,000 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఇరాన్ గురిపెట్టడం చూస్తుంటే, ఆ దేశం తన క్షిపణి సాంకేతికతను రహస్యంగా ఎంతగా అభివృద్ధి చేసుకుందో అర్థమవుతోంది.
డియాగో గార్సియా ఎందుకు ముఖ్యం? బ్రిటిష్ ఇండియన్ ఓషియన్ టెరిటరీలో ఉన్న డియాగో గార్సియా, అమెరికాకు ఒక బలమైన సైనిక కోట. ఇక్కడి నుండే అమెరికా తన సుదూర శ్రేణి బాంబర్ విమానాలు, అణు జలాంతర్గాములు మరియు యుద్ధనౌకలను నడిపిస్తుంది. మధ్యప్రాచ్యం మరియు ఆసియా ప్రాంతాలపై నిఘా ఉంచడానికి ఇది అమెరికాకు ఒక ‘స్వర్గం’ వంటిది.
ప్రతీకార దాడి: భారత్లో జరిగిన ‘మిలాన్ 2026’ (MILAN 2026) నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌక ‘IRIS Dena’ను శ్రీలంక సమీపంలో అమెరికా జలాంతర్గామి ‘USS Charlotte’ టార్పెడోలతో ముంచేసింది. ఈ దాడిలో 80 మందికి పైగా ఇరాన్ సైనికులు మరణించారు. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ ఇప్పుడు అమెరికాకు ‘రిటర్న్ గిఫ్ట్’గా డియాగో గార్సియాపై క్షిపణులను ప్రయోగించిందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు.
