బరేలీ: ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ప్రాథమిక విద్యాశాఖకు చెందిన ఉపాధ్యాయులకు వచ్చిన ఒక వింత ఆదేశం తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రతి పాఠశాల నుండి 46 కిలోల గడ్డిని దానం చేయాలని, దీనిని కచ్చితంగా అమలు చేయాలని, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది? గోశాలల కోసం గడ్డిని సేకరించాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు ఈ ఆదేశాలను జారీ చేశారు. అన్ని బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు మరియు ప్రధానోపాధ్యాయులకు పంపిన లేఖలో గడ్డిని వీలైనంత త్వరగా అందజేయాలని పేర్కొన్నారు. ప్రతి పాఠశాల నుండి కచ్చితంగా 46 కిలోల గడ్డిని దానం చేయాలన్న నిబంధనపై ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యాశాఖ పని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కానీ, ఉపాధ్యాయులపై ఇలాంటి ఒత్తిడి తేవడం కాదని ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి.
జోరుగా నిరసనలు.. దిగివచ్చిన అధికారులు: ముందుగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ‘కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించడంతో, ఉపాధ్యాయులు దీనిని బలవంతపు వసూలుగా భావించి నిరసనలు చేపట్టారు. వివాదం ముదరడంతో, అధికారులు వెంటనే స్పందించి రాత్రికి రాత్రే ఉత్తర్వులను సవరించారు. గడ్డి దానం అనేది పూర్తిగా స్వచ్ఛందమని, ఏ పాఠశాలపైనా లేదా ఉపాధ్యాయుడిపైనా ఎటువంటి ఒత్తిడి ఉండదని, దానం చేయని వారిపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు ఉండవని స్పష్టం చేశారు.
ఉపాధ్యాయుల అసంతృప్తి: అధికారులు ఆదేశాలను సవరించినప్పటికీ, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి ఇంకా తగ్గలేదు. ఆలోచన లేకుండా ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం విద్యాశాఖ పనితీరుపై ప్రశ్నలను లేవనెత్తుతుందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం అధికారులు ఉపాధ్యాయులకు నచ్చజెప్పే పనిలో నిమగ్నమయ్యారు.
