పాట్నా: బీహార్‌లోని పాట్నా జిల్లా బరియార్‌పూర్ గ్రామం నుండి గుండెలను పిండేసే ఒక అద్భుతమైన సంఘటన వెలుగుచూసింది. దాదాపు 48 సంవత్సరాల సుదీర్ఘ విరహం తర్వాత తన భార్య తిరిగి రావడంతో, ఒక వృద్ధ భర్త ఆనంద భాష్పాలతో బిగ్గరగా ఏడ్చేశాడు. ఈ అరుదైన పునఃకలయికను చూసి ఆ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులంతా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
ఇన్నేళ్లుగా తన భార్య కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసిన లాలన్ మిశ్రా, తన కళ్లెదుట భార్య నిర్మలా దేవి నిలబడి ఉండటం చూసి తట్టుకోలేకపోయారు. ఆయన కళ్ల నుండి నీళ్లు సుడులు తిరిగాయి. కుటుంబ సభ్యులంతా ఈ భావోద్వేగ క్షణాన్ని చూసి ఆనందించారు. దీంతో ఆ ఇంట్లో ఐదు దశాబ్దాల తర్వాత మళ్లీ పండగ వాతావరణం నెలకొంది.
పెళ్లయిన 6 నెలలకే పుట్టింటికి..
పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ లాలన్ మిశ్రా మాట్లాడుతూ.. తమకు 1977 మార్చిలో వివాహం జరిగిందని తెలిపారు. అయితే పెళ్లయిన కేవలం ఆరు నెలలకే నిర్మలా దేవి అత్తగారిల్లు వదిలి దర్భంగాలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె ఎప్పుడూ తిరిగి రాలేదు. ఆమె కోసం చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో వెతికినా ఫలితం లేకపోయిందని, చాలా కాలం తర్వాత ఆమె పుట్టింట్లోనే ఉంటున్నట్లు తెలిసిందని లాలన్ పేర్కొన్నారు.
భార్య ఇల్లు వదిలి వెళ్లినప్పటికీ లాలన్ మిశ్రా మరో పెళ్లి చేసుకోలేదు. తన జీవితాంతం నిర్మలా దేవి తిరిగి వస్తుందనే నమ్మకంతోనే గడిపేశారు. భార్య ఎడబాటు తట్టుకోలేక ఆయన ఒక మంచి ఉద్యోగాన్ని కూడా వదిలేసుకుని తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. లాలన్ మిశ్రా మానసికంగా కుంగిపోయినప్పటికీ, తన భార్య వస్తుందనే ఆశను మాత్రం ఎన్నడూ వదులుకోలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
నిర్మలా దేవి ఇల్లు వదిలి ఎందుకు వెళ్లింది?
ఇదే విషయమై నిర్మలా దేవి మాట్లాడుతూ.. అప్పట్లో అత్తగారింట్లోని కొందరు సభ్యుల వేధింపులు, మాటల వల్లే తాను ఇల్లు వదిలి వెళ్లాల్సి వచ్చిందని వెల్లడించింది. పుట్టింటికి వెళ్లిన తర్వాత, తన తండ్రి సహాయంతో నాగ్‌పూర్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించి, అప్పటి నుండి అక్కడే ఒంటరిగా జీవిస్తున్నట్లు చెప్పింది.
ఇన్నేళ్ల తర్వాత వృద్ధాప్యంలో తన అత్తగారింటికి తిరిగి రావాలని ఆమె నిర్ణయించుకుంది. నిర్మలా దేవి తన భర్త వద్దకు రాగానే.. పెళ్లి సమయంలో తన చేతిపై వేయించుకున్న భర్త పేరు (టాటూ) చూపించింది. ఐదు దశాబ్దాలైనా చెరిగిపోని ఆ ప్రేమ గుర్తును చూడగానే లాలన్ మిశ్రా మరియు కుటుంబ సభ్యులు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
గ్రామానికి చేరుకోవడానికి ముందు నిర్మలా దేవి తన భర్త, కుటుంబం సురక్షితంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి బఖ్తియార్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి వివరాలు సేకరించింది. ఆ తర్వాత నేరుగా భర్త ఇంటికి చేరుకుంది. జీవిత చరమాంకంలో, దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత ఒకటైన ఈ వృద్ధ జంటను చూసి గ్రామం మొత్తం హర్షం వ్యక్తం చేస్తోంది.

Leave a Reply