గుజరాత్‌లోని వడోదరకు చెందిన స్వీటీ పటేల్ (37), అజయ్ దేశాయ్ అనే వ్యక్తిని 2016లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక ఆడపిల్ల ఉంది. ఈ క్రమంలో 2021 జూన్ 4న చిన్నారితో పాటు మొబైల్ ఫోన్‌ను ఇంట్లోనే వదిలేసి స్వీటీ అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఆమె సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
తొలుత సాధారణ అదృశ్యం కేసుగా ప్రారంభమైన విచారణను, అనంతరం గుజరాత్ క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు. అధికారులు లోతుగా దర్యాప్తు చేయగా, స్వీటీ అదృశ్యమైన 49 రోజుల తర్వాత ఆమె హత్యకు గురైనట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
విచారణలో నివ్వెరపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. స్వీటీని పెళ్లి చేసుకున్న తర్వాత అజయ్ దేశాయ్ 2017లో మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆ రెండో భార్యకు విడాకులు ఇవ్వాలని స్వీటీ నిలదీయడంతో వారి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. దీంతో కక్ష పెంచుకున్న అజయ్, స్వీటీని గొంతునులిమి హత్య చేసి తన స్నేహితుడు కిరీట్సింగ్ జడేజా సాయంతో మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో దహనం చేసి ఆధారాలు మాయం చేశాడు.
ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వీటీ ఆభరణాలు, కాలిన ఎముకల శకలాలను స్వాధీనం చేసుకుని డీఎన్ఏ పరీక్షల ద్వారా నిరూపించారు. 40 మందికి పైగా సాక్షులు, ఫోరెన్సిక్ మరియు సాంకేతిక ఆధారాలతో నేరం రుజువైంది.
ఈ కేసులో తాజాగా తీర్పు వెలువరించిన న్యాయస్థానం.. భార్యను అతికిరాతకంగా హత్య చేసిన భర్త అజయ్ దేశాయ్‌కి యావజ్జీవ కారాగార శిక్ష (జీవిత ఖైదు) మరియు రూ.2 లక్షల జరిమానా విధించింది. అలాగే ఆధారాలు మాయం చేసేందుకు సహకరించిన కిరీట్సింగ్ జడేజాకు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2 లక్షల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.
