రష్యా బలగాల డ్రోన్ దాడులతో హోరెత్తుతున్న ఉక్రెయిన్ యుద్ధభూమిలో, 491 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన ఒక ఉక్రెయిన్ సైనికుడిని.. సైన్యం ఓ భారీ డ్రోన్ సహాయంతో గగనతలం మీదుగా సురక్షితంగా రక్షించిన చారిత్రాత్మక సంఘటన ప్రపంచవ్యాప్తంగా విస్మయం కలిగిస్తోంది.
ఉక్రెయిన్‌కు చెందిన 30వ మెకనైజ్డ్ బ్రిగేడ్‌కు చెందిన కాన్స్టాంటిన్ వివాసెంకో (49) అనే పదాతిదళ సైనికుడు, ఖార్కివ్ ప్రాంతంలోని ముందంజలో ఉన్న యుద్ధభూమిలో తన తోటి సైనికుడితో కలిసి ఉన్నాడు. గత ఫిబ్రవరిలో రష్యా జరిపిన డ్రోన్ దాడిలో వివాసెంకో ఎడమ పాదం పూర్తిగా తెగిపోగా, కుడి కాలికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. శత్రు బలగాల నిరంతర డ్రోన్ల సంచారం వల్ల యుద్ధభూమి నుండి తప్పించుకోలేకపోయిన పరిస్థితుల్లో, అతడు కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన తన కుడి పాదాన్ని కూడా కత్తితో తానే కోసి తొలగించి, రక్తస్రావం ఆపడానికి ఒక గుడ్డతో గట్టిగా కట్టుకున్నాడు.
ధ్వంసమైన ఒక పాఠశాలలోని బాయిలర్ కింద ఉన్న చిన్న గుంతలో.. ఆకలి, బాధ, తీవ్రమైన నొప్పితో దాదాపు 8 నెలల పాటు ప్రాణాలతో పోరాడుతూ అక్కడే ఉండిపోయాడు. డ్రోన్ల ద్వారా మాత్రమే అతనికి నిత్యావసర వస్తువులు అందించేవారు. అతని స్థానంలో కొత్త సైనికులను పంపడానికి ఉక్రెయిన్ చేసిన ప్రయత్నాలన్నింటిలో వచ్చిన సైనికులంతా శత్రు దాడుల్లో చంపబడటంతో, అతను బ్రతుకుతానన్న ఆశనే కోల్పోయాడు.
ఈ నేపథ్యంలో, గత అక్టోబర్ 4న ఉక్రెయిన్ సైన్యం మునుపెన్నడూ చూడని విధంగా ఒక సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్‌ను (సహాయక చర్యను) చేపట్టింది. 6 రెక్కలున్న ఓ భారీ యుద్ధ డ్రోన్‌కు సేఫ్టీ హార్నెస్ (తాడు) ద్వారా వివాసెంకోను సురక్షితంగా కట్టి, గగనతలం గుండా సుమారు 15 కిలోమీటర్ల దూరం పాటు ఎగురవేసి సురక్షితంగా రక్షించారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో, ఒక సైనికుడిని డ్రోన్ ద్వారా గగనతలం మీదుగా రక్షించడం ఇదే తొలిసారి అని ఉక్రెయిన్ సైనిక కమాండర్లు తెలిపారు.

Leave a Reply