5 ఏళ్ల ఉద్యోగానికి ₹1.5 కోట్ల ఇల్లు! కంపెనీ ఆఫర్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు.. ‘మాకు ఈ ఉద్యోగమే కావాలి’ అంటూ కామెంట్స్

నేటి సోషల్ మీడియా కాలంలో కంపెనీలు తమ సిబ్బందిని మానసికంగా కనెక్ట్ చేసుకోవడానికి రకరకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతున్నాయి. సాధారణంగా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తామని బెదిరిస్తుంటాయి, కానీ చైనాకు చెందిన ఒక సంస్థ మాత్రం తన నైపుణ్యం కలిగిన సిబ్బందిని కాపాడుకోవడానికి అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.

ఏమిటా ఆఫర్? ఆటోమోటివ్ ఫాస్టెనర్స్ తయారు చేసే ‘జెజియాంగ్ గుయోషెంగ్ ఆటోమొబైల్ కో లిమిటెడ్’ (Zhejiang Guosheng Automobile Co Ltd) అనే కంపెనీ, తన వద్ద కనీసం ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులకు ఉచితంగా అపార్ట్‌మెంట్లను ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం కంపెనీ తన ఆఫీసు సమీపంలోనే సుమారు 18 రెసిడెన్షియల్ ఫ్లాట్‌లను కొనుగోలు చేసింది.

గ్రాట్యుటీ వచ్చే లోపే ₹1.5 కోట్ల ఇల్లు: ఈ అపార్ట్‌మెంట్లు కంపెనీకి 5 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. వీటి పరిమాణం 100 నుండి 150 చదరపు మీటర్ల వరకు ఉంటుంది. కంపెనీ యజమాని రెండేళ్ల క్రితమే సుమారు 10 మిలియన్ యువాన్లు (సుమారు ₹12.7 కోట్లు) వెచ్చించి వీటిని కొన్నారు. ఇప్పుడు వీటి విలువ మార్కెట్ ధర ప్రకారం ఒక్కోటి ₹1.2 కోట్ల నుండి ₹1.5 కోట్ల మధ్యలో ఉంది.

ఐదుగురు లక్కీ ఉద్యోగులు: ఈ ఏడాది ఐదుగురు ఉద్యోగులకు ఈ ఫ్లాట్‌లను కేటాయించారు. వీరిలో ఇద్దరు జూనియర్ స్థాయి నుండి మేనేజ్‌మెంట్ స్థాయికి ఎదిగిన వారు కావడం విశేషం. ఫ్లాట్ పొందిన వారు మరో ఐదేళ్ల పాటు కంపెనీలోనే పనిచేయాల్సి ఉంటుంది. 2026లో మరో 8 మందికి ఈ బహుమతులు ఇవ్వాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

యజమాని కాదు.. దైవం! సాధారణంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో ఐదేళ్లు పనిచేస్తే కేవలం గ్రాట్యుటీ (Gratuity) మాత్రమే వస్తుంది. కానీ ఐదేళ్ల విధేయతకు ఏకంగా కోటిన్నర విలువైన ఇల్లు ఇస్తున్న యజమానిని నెటిజన్లు ఆకాశానికెత్తేస్తున్నారు. “ఆయన యజమాని కాదు, దైవం” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

భారత్‌లో కూడా సూరత్‌కు చెందిన సావ్జీ ధోలాకియా వంటి వ్యాపారవేత్తలు తమ ఉద్యోగులకు కార్లు, ఇళ్లు, జ్యువెలరీని బోనస్‌గా ఇస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ చైనీస్ కంపెనీ కూడా అదే బాటలో నడుస్తోంది.


Posted

in

by

Tags: