చెన్నై విరుగంబాక్కంలో ఆన్లైన్లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసి తిన్న విద్యార్థినులు ఆసుపత్రి పాలైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఘటన వివరాలు: చెన్నై విరుగంబాక్కం సమీపంలోని దశరథపురానికి చెందిన దినేష్ కుమార్ తన అక్క కుమార్తెలు నర్మద (19 – డిగ్రీ విద్యార్థిని), రుద్ర (15 – 10వ తరగతి విద్యార్థిని) అడగడంతో నిన్న రాత్రి Blinkit యాప్ ద్వారా అర కిలో ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేశారు.
డెలివరీ వచ్చిన కొద్దిసేపటికే ఆ ఇద్దరు విద్యార్థినులు ఐస్‌క్రీమ్ తిన్నారు. తిన్న కొద్ది నిమిషాలకే వారిద్దరికీ విపరీతమైన వాంతులు, కడుపునొప్పి మొదలయ్యాయి. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఐస్‌క్రీమ్ ప్యాకెట్‌పై ఉన్న తేదీని గమనించగా, అది 5 నెలల క్రితమే (Expiry Date) గడువు ముగిసినట్లు చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
యాజమాన్యం నిర్లక్ష్యం: దీనిపై బ్లింకిట్ (Blinkit) యాజమాన్యాన్ని సంప్రదించగా, మొదట తమ తప్పును ఒప్పుకున్నారని, కానీ తర్వాత మాట మార్చి తమ తప్పేమీ లేనట్లు మాట్లాడుతున్నారని బాధితుల బంధువు దినేష్ కుమార్ ఆరోపించారు. ఆన్లైన్లో ఆహారం ఆర్డర్ చేసే వారు ఇలాంటి ఇబ్బందులు పడకూడదని, బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
