న్యూఢిల్లీ: ఐదేళ్లకు పైగా పనిచేస్తున్న సంస్థ నుండి ఒక్క రోజులో ఉద్యోగం నుండి తొలగిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించగలరా? ఇలాంటి చేదు అనుభవాన్నే ఎదుర్కొన్న ఢిల్లీకి చెందిన అనకృతి విద్యార్థి అనే యువతి, తన మనసులోని వేదనను ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకుంది.
ఏం జరిగింది? “నాకు ఉద్యోగం పోయింది. ఈ రోజు 2026 జూన్ 29. హెచ్ఆర్ (HR) మరియు మేనేజర్ ఫోన్ చేసి, ఇకపై కంపెనీకి నా రోల్ అవసరం లేదని, వెంటనే ఉద్యోగం వదిలేయాలని చెప్పారు. నేను దాదాపు ఐదేళ్లన్నరగా ఈ సంస్థలో పనిచేస్తున్నాను” అని అనకృతి కన్నీటితో వెల్లడించింది. ఒక్కసారిగా జరిగిన ఈ మార్పుతో ఏం చేయాలో, ఎక్కడి నుండి మొదలుపెట్టాలో అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతా మళ్లీ సున్నా నుండి మొదలుపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆమె తెలిపింది.
సానుకూల దృక్పథం: ఉద్యోగం కోల్పోయినప్పటికీ, ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. “బహుశా ఇది దేవుడు ఇచ్చిన సంకేతం కావచ్చు. నేనైతే ఎప్పటికీ ఈ ఉద్యోగాన్ని వదిలేదాన్ని కాను. బహుశా దేవుడే ‘చాలు, ఇక అక్కడి నుండి బయటకు రా’ అని చెబుతున్నారేమో” అని ఆమె సానుకూలంగా స్పందించింది. ఇకపై ప్రతి నెల జీతం రాదనే విషయం తనను కలవరపెడుతున్నా, కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తానని ఆమె పేర్కొంది. “ఓన్ వర్డ్స్ అండ్ అప్ వర్డ్స్” అనే క్యాప్షన్‌తో ఆమె ఈ వీడియోను షేర్ చేసింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఉద్యోగం పోవడం బాధాకరమే అయినా, ధైర్యంగా ఉండాలని చాలామంది ఆమెకు ధైర్యం చెబుతున్నారు.
