50% డిస్కౌంట్‌తో క్యాన్సర్ మందులు..! కర్ణాటక నుంచి తమిళనాడు, మహారాష్ట్ర వరకు విస్తరించిన నకిలీ మందుల దందా.. తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు!

బెంగళూరు నగరంలోని 90కి పైగా ఆసుపత్రులు, క్లినిక్‌లకు సగం ధరకే అంటే 50 శాతం డిస్కౌంట్‌తో క్యాన్సర్ మందులు సరఫరా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన విషయం తీవ్ర కలకలం రేపింది.

అయితే ఆరోగ్యశాఖ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఆ మందులు నకిలీవని గుర్తించినట్లు సమాచారం. దీంతో బెంగళూరు ప్రజలు, ముఖ్యంగా క్యాన్సర్‌ చికిత్స పొందుతున్న రోగులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.

గత ఆగస్టు 18న బెంగళూరు పరిసర ప్రాంతాల్లోని ఓ ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ.5 కోట్ల విలువైన నకిలీ మందులు, నకిలీ ఇన్వాయిస్‌లు, ఇంజెక్షన్లు నింపేందుకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

బెంగళూరులోని మినర్వా సర్కిల్ సమీపంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘కృపా హెల్త్‌కేర్’ అనే సంస్థ నకిలీ మందులను నిల్వ చేసి వివిధ ప్రాంతాలకు సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా పనిచేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

ఈ భారీ మోసం కేసులో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ షాప్ యజమాని వీరేష్‌కుమార్ జైన్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అతడిని విచారించగా, గత ఐదేళ్లుగా ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

అలాగే నకిలీ మందులను ఆసుపత్రులకు చేరవేయడం, పంపిణీ చేయడంలో సహకరించినట్లు అనుమానిస్తున్న 15 మందికి పైగా మెడికల్ రిప్రజెంటేటివ్‌లను కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నకిలీ మందుల నెట్‌వర్క్ కేవలం కర్ణాటకకే పరిమితం కాలేదని దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలతోనూ ఈ ముఠాకు సంబంధాలు ఉన్నట్లు పోలీసుల తనిఖీల్లో బయటపడినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ నకిలీ మందులను కొనుగోలు చేసి, రోగులకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న ఆసుపత్రుల జాబితాను ఆరోగ్యశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు.

క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు చికిత్స పొందుతున్న రోగుల ప్రాణాలతో చెలగాటమాడేలా నకిలీ మందులను సరఫరా చేసినట్లు ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వ్యవహారంపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: