500 rs Note Ban: ఈ ఏడాది ₹500 నోట్లు రద్దు కాబోతున్నాయా? కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడిన కీలక సమాచారం

నవంబర్ 8, 2016న 500 మరియు 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ ఏ నోట్లు రద్దు కాలేదు. అయితే, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ, నోట్ల రద్దు జరగబోతోందంటూ తరచుగా సోషల్ మీడియాలో వదంతులు షికారు చేస్తూనే ఉన్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్చి 2026 నాటికి ₹500 నోట్ల ముద్రణ మరియు చలామణిని నిలిపివేస్తున్నారనే వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ వార్తలపై స్పందించి స్పష్టతనిచ్చింది.

ఫ్యాక్ట్ చెక్ (Fact Check) ఏం చెబుతోంది?

ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వార్తలను పూర్తిగా కొట్టిపారేసింది. దీనిపై ఒక వివరణను విడుదల చేస్తూ:

  • “మార్చి 2026 నాటికి భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ₹500 నోట్ల చలామణిని నిలిపివేస్తుందని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.”
  • “RBI అటువంటి ప్రకటన ఏదీ చేయలేదు. ఈ వార్తలు పూర్తిగా అబద్ధం” అని PIB స్పష్టం చేసింది.
₹500 నోట్లు చట్టబద్ధమే!

ప్రస్తుతం చలామణిలో ఉన్న ₹500 నోట్లు పూర్తిగా చట్టబద్ధమైనవని (Legal Tender), అన్ని రకాల లావాదేవీలకు వీటిని యథావిధిగా వాడుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ప్రజలు ఇటువంటి తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని, సమాచారాన్ని ఇతరులకు షేర్ చేసే ముందు అధికారిక వనరుల ద్వారా ధృవీకరించుకోవాలని సూచించింది.

గతంలోనూ ఇవే వదంతులు:

₹500 నోట్ల రద్దుపై వదంతులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు ఇటువంటి వార్తలు వైరల్ అయ్యాయి. గత ఆగస్టులో పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. ₹500 నోట్ల చలామణిని నిలిపివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టంగా చెప్పారు.


Posted

in

by

Tags: