భారత ఐటీ రంగంలో ఉద్యోగం సాధించడానికి నిర్వహించే ఇంటర్వ్యూ ప్రక్రియపై ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
గత 6 నెలలుగా ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపిన సదరు ఇంజనీర్.. భారత్లో టెక్నికల్ ఇంటర్వ్యూల తీరు అత్యంత కఠినంగా ఉంటోందంటూ తన అనుభవాలను పంచుకున్నారు.
ఆయన పోస్ట్ ప్రకారం.. నిజ జీవితంలో రోజువారీ ప్రాజెక్ట్ పనులకు అవసరమయ్యే నైపుణ్యాలను మించి, కంపెనీల ఇంటర్వ్యూలలో అనవసరమైన క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సంక్లిష్టమైన కోడింగ్ రాయడం మొదలుకొని గార్బేజ్ కలెక్టర్ (Garbage Collector), కుబెర్నెటిస్ (Kubernetes), డాకర్ (Docker) వంటి సాంకేతికతల అంతర్గత పనితీరు, లోతైన కమాండ్స్ వరకు అన్నీ కంఠస్థం చేసి ఉండాలని ఆశిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
దీనికి భిన్నంగా, ఐరోపాలో ఉద్యోగం కోసం ప్రయత్నించిన తన స్నేహితుడికి కేవలం 3 లేదా 4 రౌండ్ల ఇంటర్వ్యూలతోనే ఉద్యోగ ఆఫర్లు వచ్చాయని ఆయన పోల్చి చూపారు. భారత్లో ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రతిభను గుర్తించి ఎంపిక చేసుకోవడానికి బదులుగా, అభ్యర్థులను ఎలాగైనా ఎలిమినేట్ చేసే వడపోత ప్రక్రియలా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, ఈ అభిప్రాయంపై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. భారతదేశంలో ఒక్కో పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య విపరీతంగా ఉండటం వల్లే కంపెనీలు బహుళ దశల ఎంపిక విధానాలను అమలు చేయాల్సి వస్తోందని కొందరు సమర్థించారు. మరికొందరేమో.. సైద్ధాంతిక అంశాల కంటే ప్రాక్టికల్ నైపుణ్యాలకు, నిజమైన పని అనుభవానికే సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. దీంతో ఈ పోస్ట్ కేవలం ఒక ఇంజనీర్ వ్యక్తిగత అనుభవం మాత్రమే కాకుండా, భారత ఐటీ రంగంలోని నియామక ప్రక్రియపై లోతైన చర్చకు తెరలేపింది.
