6 రోజులుగా చుక్క నీరు కూడా ముట్టకుండా కఠిన ఉపవాసం.! చేతిలో కలశం పట్టుకున్న మహిళ ఆరోగ్యం విషమం.. “దుర్గామాత ఉంది, నాకేమీ కాదు.!!”

బీహార్‌లోని సుపాల్ జిల్లాలో, తండ్రి ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటూ నవరాత్రుల సందర్భంగా అత్యంత కఠినమైన ఉపవాస దీక్ష చేపట్టిన ఓ మహిళ ఆరోగ్యం విషమంగా మారింది.

చేతిలో కలశం పట్టుకుని పూజలు చేస్తున్న కుట్టీ దేవి అనే మహిళ, వైద్యులు చికిత్స తీసుకోవాలని సూచించినప్పటికీ తన దీక్షను విరమించడానికి నిరాకరించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

త్రివేణిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుషహా ప్రాంతానికి చెందిన కుట్టీ దేవి, పక్షవాతానికి గురైన తన తండ్రి వాసుదేవ్ సర్దార్ పూర్తిగా కోలుకోవాలని దుర్గామాతను వేడుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి ఆరోగ్యం కుదుటపడితే నవరాత్రుల తొమ్మిది రోజులూ ఆహారం తీసుకోకుండా, కుడిచేతిలో కలశం ధరించి పూజలు చేస్తానని ఆమె మొక్కుకున్నారు.

తన మొక్కు తర్వాత తండ్రి ఆరోగ్యం మెరుగుపడటంతో, ఆమె నవరాత్రుల మొదటి రోజు నుంచే ఆలయంలో పూజలు చేయడం ప్రారంభించారు. అయితే, ఆమెను పరీక్షించిన వైద్య బృందం.. ఆమె రక్తపోటు (బీపీ) అసాధారణంగా పడిపోయిందని, గుండె కొట్టుకునే వేగంలో కూడా తీవ్ర సమస్యలు ఉన్నాయని గుర్తించింది. ఆమె గతంలోనే గుండె జబ్బుతో బాధపడుతున్నారని, ఈ ఉపవాసం కారణంగా రోజూ వేసుకోవాల్సిన మందులను కూడా ఆపివేసినట్లు వైద్యులు తెలిపారు.

ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన వైద్యులు, తక్షణమే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాలని సూచించారు. దీంతో సబ్ కలెక్టర్ (SDM) సహా ఉన్నతాధికారులు స్వయంగా ఆమె వద్దకు వెళ్లి, కుటుంబ సభ్యులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, తన నమ్మకంపై పూర్తి ధీమాతో ఉన్న ఆమె.. “నాకు దుర్గామాత అండగా ఉంది, నాకేమీ కాదు” అంటూ మొండిగా కూర్చున్నారు. ఆహారం, నీరు లేకుండా సుదీర్ఘ సమయం గడపడం, అలాగే అత్యవసర మందులను ఆపేయడం ప్రాణాంతకమని స్పష్టం చేస్తున్న అధికారులు, ఆమె ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *