దీపావళి అంటేనే ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, రంగోలీలు వేయడం ఆనవాయితీ. కానీ, దుబాయ్‌లో వీటన్నింటికీ ఒక అడుగు ముందుకు వేసి, ఏకంగా బంగారం, వజ్రాలతో ఒక భారీ రంగోలీని రూపొందించారు.
విభిన్నంగా ఉన్న ఈ కళాఖండం ప్రస్తుతం పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.
దుబాయ్‌లోని సిటీ సెంటర్ డేరా (Deira) షాపింగ్ మాల్లో ఉన్న ఓ ప్రముఖ జ్యువెలరీ షాపులో, దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ రంగోలీని తయారు చేశారు. సుమారు 2 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు ఉన్న ఈ రంగోలీలో 6.5 కిలోల బంగారం, 380 క్యారెట్లకు పైగా వజ్రాలను ఉపయోగించారు.
ఈ రంగోలీని రూపొందించడానికి నెక్లెస్‌లు, గాజులు, కమ్మలు, ఉంగరాలు సహా మొత్తం 213 రకాల ఖరీదైన ఆభరణాలను ఉపయోగించారు. 10 మంది కళాకారులు సుమారు 16 గంటల పాటు శ్రమించి ఈ భారీ కళాఖండాన్ని చేతులతో తీర్చిదిద్దారు. పూలు, రంగుల పొడులకు బదులుగా ఖరీదైన ఆభరణాలతో దీనిని రూపొందించడం దీని ప్రత్యేకత.
నవంబర్ 6న జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ భారతీయ నటి తమన్నా భాటియా పాల్గొని ఈ బంగారు రంగోలీని ప్రారంభించారు. బంగారం, వజ్రాలతో మెరిసిపోతున్న ఈ కళాఖండాన్ని చూసేందుకు స్థానికులు, పర్యాటకులు ఆసక్తిగా అక్కడికి తరలివస్తున్నారు. ఒక సాధారణ రంగోలీని ఇంత అద్భుతంగా మార్చగలరా అని ఈ సృష్టి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Leave a Reply