“6 నెలలు. 11 కేసులు. 23 మందికి ఉరిశిక్ష విధించిన జడ్జి.” సంచలనం రేపిన మరణదండన తీర్పులు. 97 కేసులు వెనక్కి తీసుకోవడంతో దుమారం. న్యాయమూర్తి ఆకస్మిక బదిలీ.!

ఉత్తరప్రదేశ్‌లో గత 6 నెలల్లో 11 కేసుల్లో 23 మందికి ఉరిశిక్ష విధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవి కుమార్ దివాకర్‌ను.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ముజఫర్‌నగర్‌లోని కుటుంబ సంక్షేమ న్యాయస్థానానికి (ఫ్యామిలీ కోర్టుకు) ఆకస్మికంగా బదిలీ చేశారు.

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రిసైడింగ్ అధికారిగా పనిచేస్తున్న న్యాయమూర్తి దివాకర్, ప్రస్తుతం కుటుంబ సంక్షేమ న్యాయస్థానం అదనపు ప్రిన్సిపల్ జడ్జిగా నియమితులయ్యారు. అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఈ ఆదేశాల నేపథ్యంలో, ఆయన స్థానంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా శివ కుమారి బాధ్యతలు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.

న్యాయమూర్తి దివాకర్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న స్వల్ప వ్యవధిలోనే 11 వేర్వేరు కేసుల్లో 23 మందికి మరణదండన విధిస్తూ సంచలన తీర్పులిచ్చారు. అయితే, తన కోర్టులో విచారణలో ఉన్న హత్య కేసులతో సహా 97 కీలకమైన కేసుల ఫైళ్లను అప్పటి జిల్లా, సెషన్స్ జడ్జి పి.కె. సింగ్ పరిపాలనాపరమైన ఆదేశాల ద్వారా అకస్మాత్తుగా వెనక్కి తీసుకోవడంపై న్యాయమూర్తి దివాకర్ ఇటీవల తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు.

10 ఏళ్ల నాటి ఓ డ్రగ్స్ (మాదకద్రవ్యాల) కేసులో నిందితుడిని నిర్దోషిగా విడుదల చేస్తూ ఇచ్చిన 35 పేజీల తీర్పులో, “చట్టపరమైన విధానాలను పాటించకుండా కేవలం పరిపాలనా ఉత్తర్వుల ద్వారా.. అది కూడా తీవ్రమైన విచారణ దశలో ఉన్న కేసులను ఎలా వెనక్కి తీసుకోగలరు?” అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, జిల్లా న్యాయమూర్తుల పరిపాలనాపరమైన అధికార పరిధులు, న్యాయవ్యవస్థ స్వతంత్రత గురించి ఆయన వ్యక్తం చేసిన ఆందోళన న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీయడం గమనార్హం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *