ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఒక సాధారణ ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ తన జీవితాన్ని ఇలా తలకిందులు చేస్తుందని ఆ యువతి కలలో కూడా ఊహించి ఉండదు.
హర్యానా రాష్ట్రం సోనిపట్ ప్రాంతానికి చెందిన ఆ యువతికి కొద్ది నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తన పేరు ‘జానీ’ అని, తాను హిందువునని పరిచయం చేసుకున్నాడు. కొద్దిరోజుల్లోనే ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో, ఇరువైపులా హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నవదంపతులుగా సంతోషంగా కాపురం మొదలుపెట్టారు.
అయితే, ఒకరోజు భర్త బ్యాగును యాదృచ్ఛికంగా వెతికిన భార్యకు ఒక గుర్తింపు కార్డు (ID కార్డ్) కనిపించింది. అందులో ఉన్న పేరు ‘జానీ’ కాదు.. ‘జావేద్ ఖాన్’! దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆ యువతి ఆరా తీయగా.. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ముస్లిం అని, నకిలీ గుర్తింపుతో తనను నమ్మించి మోసం చేశాడని బయటపడింది.
కథ ఇక్కడితో ముగియలేదు! ఒకరోజు వారు నివసిస్తున్న ఇంటికి ఒక మహిళ అకస్మాత్తుగా వచ్చింది. ఆమె మరెవరో కాదు.. జావేద్ అసలు మొదటి భార్య! జావేద్‌కు 12 ఏళ్ల క్రితమే వివాహం జరిగిందని, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని తేలింది. అక్కడ తీవ్ర గొడవ జరిగిన అనంతరం మొదటి భార్య జావేద్‌ను తన వెంట తీసుకెళ్లిపోయింది.
అయినప్పటికీ, కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆ యువతి వద్దకు వచ్చిన జావేద్.. తమను విడదీయాలని చూస్తున్నారని నమ్మించి, ఆమెను ఉత్తరప్రదేశ్‌లోని బుధానా ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి సోనిపట్‌కు వచ్చిన తర్వాతే అసలైన నరకం మొదలైంది.
జావేద్, అతని కుటుంబ సభ్యులు కలిసి ఆ యువతిని బలవంతంగా మతం మారాలంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అందుకు ఆమె నిరాకరించడంతో, తీవ్ర అసభ్య పదజాలంతో దూషిస్తూ, విచక్షణారహితంగా దాడులు చేసి ప్రాణహాని తలపెడతామని బెదిరించారు.
గత వారం రోజులుగా జావేద్, అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉండగా, బాధితురాలు పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించి తనపై జరిగిన అకృత్యాలపై న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. ఆమెకు మద్దతుగా స్థానిక సంఘాలు కూడా గళం విప్పాయి.
ప్రస్తుతం బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ గుర్తింపుతో నమ్మించి మోసపూరితంగా పెళ్లి చేసుకున్న సదరు నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
