లూధియానా: పంజాబ్‌లోని లూధియానాలో రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ అధికారి తన కొడుకును తుపాకీతో కాల్చి చంపి, ఆపై తాను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
ఆదివారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 60 ఏళ్ల తండ్రి రెండో వివాహం చేసుకోవాలనుకోవడంపై, అవివాహితుడైన అతని కొడుకుతో జరిగిన గొడవ ఈ ఘర్షణకు దారితీసింది. లూధియానాలోని న్యూ అగర్ నగర్లో ఈ హత్య మరియు ఆత్మహత్య జరిగాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాజీ సైనికుడు సురీందర్ సింగ్ (60), తన కుమారుడు గుర్శరణ్ సింగ్ (40)ని కాల్చి చంపి తాను తనువు చాలించారు. సురీందర్ సింగ్ భార్య ఐదేళ్ల క్రితం మరణించారు. అప్పటి నుండి ఆయన మరో పెళ్లి చేసుకోవాలన్న కోరికను వెలిబుచ్చగా, కొడుకు గుర్శరణ్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాడు. గత మూడేళ్లుగా ఈ విషయంలో తండ్రీకొడుకుల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయని ఇరుగుపొరుగు వారు తెలిపారు. సురీందర్ సింగ్‌కు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు, వారు ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తున్నారు. ఇంట్లో తండ్రి మరియు కొడుకు మాత్రమే ఉండేవారు.
ఘటన జరిగిన తీరు: ఆదివారం రాత్రి భోజన సమయంలో మళ్ళీ ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దది కావడంతో ఆగ్రహానికి లోనైన సురీందర్ సింగ్ తన లైసెన్స్ కలిగిన డబుల్ బ్యారెల్ తుపాకీతో కొడుకుపై కాల్పులు జరిపారు. మొదటిసారి గురి తప్పడంతో గుర్శరణ్ ప్రాణభయంతో వీధిలోకి పరుగెత్తాడు. కానీ తండ్రి అతడిని వదలకుండా వెంబడించి నడిరోడ్డుపై కాల్చి చంపారు. తీవ్ర రక్తస్రావంతో గుర్శరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
కొడుకును చంపిన తర్వాత ఇంటికి చేరుకున్న సురీందర్ సింగ్, తలుపులు లోపల నుండి గడియ పెట్టుకుని విషం సేవించారు. తుపాకీ శబ్దం విని వచ్చిన స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న గుర్శరణ్ను చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా సురీందర్ స్పృహ లేకుండా పడి ఉన్నారు. ఆసుపత్రికి తరలించినప్పటికీ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
ఘటన సమయంలో ఇద్దరూ మద్యమత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుండి తుపాకీని, విషపు బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల్లో ఉన్న కుమార్తెలకు సమాచారం అందించామని, పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని శరభ నగర్ పోలీసులు తెలిపారు.
