ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో టెక్ ప్రపంచంలో అనిశ్చితి నెలకొంది. వివిధ ప్రముఖ కంపెనీలు సామూహిక తొలగింపులను (Layoffs) కొనసాగిస్తున్నాయి. తాజాగా మెటా సంస్థ ఒక్కటే 8,000 మంది ఉద్యోగులను తొలగించింది. మెటా, అమెజాన్, లింక్డ్‌ఇన్ వంటి దిగ్గజ అమెరికన్ టెక్ కంపెనీలు ఏఐకి అధిక ప్రాధాన్యతనిస్తూ తమ విధానాలను మార్చుకోవడంతో, అమెరికాలో పనిచేస్తున్న వేలమంది భారతీయ టెక్ నిపుణులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు.
అమెరికాలోని అతిపెద్ద టెక్ కంపెనీలను నిర్మించడంలో దశాబ్దాలుగా భారతీయ ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు కీలక పాత్ర పోషించారు. వీరిలో చాలామంది కుటుంబాలతో సహా అక్కడే స్థిరపడ్డారు. అయితే, ఇప్పుడు ఉద్యోగం కోల్పోవడంతో, అమెరికాలో నివసించే వారి హక్కులపై నీలినీడలు కమ్ముకున్నాయి.
2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన యూఎస్ ప్రభుత్వ డేటా ప్రకారం, హెచ్-1బి (H-1B) వీసా దరఖాస్తుల్లో ఎక్కువ శాతం భారతీయులవే ఉన్నాయి. అమెరికాలోని చాలామంది భారతీయ టెక్ నిపుణులు తమ యజమానులపై ఆధారపడిన హెచ్-1బి వీసాలపై పనిచేస్తున్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన తర్వాత మరొక కంపెనీలో వీసా స్పాన్సర్ చేసే యజమానిని వెతుక్కోవడానికి వీరికి కేవలం 60 రోజుల గడువు మాత్రమే ఉంటుంది. ఇందులో విఫలమైతే, వారు కచ్చితంగా దేశం విడిచి వెళ్ళాల్సి ఉంటుంది.
సంవత్సరాలుగా అమెరికాలో ఉంటూ, ఇళ్లు కొనుక్కొని, పిల్లల చదువులు, ఇతర ఆర్థిక బాధ్యతలతో స్థిరపడిన భారతీయులకు ఈ మార్పు పెద్ద షాక్‌గా మారింది. గ్రీన్ కార్డ్ కోసం ఏళ్లుగా వేచి చూస్తున్న వారు, అమెరికాలోనే పుట్టిన పిల్లలు ఉన్నవారు ఈ ఆకస్మిక తొలగింపులతో అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఉద్యోగం పోతే తమ ప్రణాళికలన్నీ తలకిందులవుతాయని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం చాలామంది తాత్కాలికంగా అక్కడే ఉండటానికి ‘బి-2 (B-2) విజిటర్ వీసా’ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) నిబంధనల ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బి కార్మికులకు 60 రోజుల ‘గ్రేస్ పీరియడ్’ లభిస్తుంది. ఈ సమయంలో వారు కొత్త యజమానిని వెతుక్కోవడమో, వీసా కేటగిరీని మార్చుకోవడమో లేదా దేశం విడిచి వెళ్లడానికి సిద్ధం కావడమో చేయాలి.
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త స్పాన్సర్‌ని కనుగొనడం అంత సులభం కాదు. కంపెనీలు కొత్త నియామకాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండటం, ఇంటర్వ్యూ ప్రక్రియకు సమయం పట్టడం, వీసా బదిలీకి సంబంధించిన పేపర్ వర్క్ వంటి సమస్యలు ఉద్యోగం కోల్పోయిన వారికి సవాలుగా మారాయి. ఇమ్మిగ్రేషన్ లాయర్లు ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయిన వారికి ‘ఫారమ్ I-539’ దాఖలు చేసి, తాత్కాలికంగా ‘బి-1 లేదా బి-2 విజిటర్ వీసా’కు మారాలని సూచిస్తున్నారు. నివేదికల ప్రకారం, 2026లో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఐటీ ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు.
