“65 ఏళ్ల ముసలాయన్ని నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే..!” రూ.3 లక్షలకు 23 ఏళ్ల యువతిని బేరం పెట్టిన కుటుంబం.. నిరాకరించడంతో ఒంటిపై మరిగే నీళ్లు పోసిన దారుణం!

హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లో 23 ఏళ్ల ప్రీతి అనే యువతి.. 65 ఏళ్ల వృద్ధుడిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే కారణంతో ఆమెపై అత్యంత దారుణంగా దాడి జరిగినట్లు ఫిర్యాదు అందింది.

పెళ్లికి నిరంతరం నిరాకరిస్తూ రావడంతో, తనపై మరిగే వేడి నీటిని కుమ్మరించారని బాధితురాలు ఆరోపించింది. ఈ దాడిలో తీవ్ర కాలిన గాయాలైన ఆ యువతి ప్రస్తుతం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో తీవ్ర చికిత్స పొందుతోంది.

బాధితురాలు ప్రీతి స్వస్థలం బీహార్ రాష్ట్రం అని సమాచారం. దాదాపు రెండేళ్ల క్రితం ఫరీదాబాద్‌కు చెందిన రోహిత్ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా, కుటుంబ కలహాల కారణంగా రెండు నెలల క్రితం భర్త నుంచి వేరుపడిందని ఆమె మేనమామ తెలిపారు. ఆ తర్వాత ధర్మేంద్ర, లలిత అనే దంపతుల పరిచయంతో వారి వద్దే ఉంటోందని, ఆమెను కన్నకూతురిలా చూసుకుంటామని వారు చెప్పారని తెలిపారు.

అయితే వారితో రెండు నెలలు ఉన్న తర్వాతే అసలు విషయం బయటపడిందని ప్రీతి బంధువులు ఆరోపిస్తున్నారు. 65 ఏళ్ల వృద్ధుడికి ప్రీతిని ఇచ్చి పెళ్లి చేసేందుకు పథకం వేసి, దీనికోసం రూ.3 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. ఈ పెళ్లికి ప్రీతి ఒప్పుకోకపోవడంతో ఆగస్టు 16 తెల్లవారుజామున ఆమెపై మరిగే నీళ్లు పోశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే రూ.3 లక్షల డీల్ ఆరోపణలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.

ఈ దారుణం తర్వాత ప్రీతిని బయటకు రానివ్వకుండా గదిలో బంధించి, ఆమె ఫోన్‌ను కూడా లాక్కున్నారని సమాచారం అందింది. విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులతో కలిసి వెళ్లి తలుపులు తెరిపించి, ప్రీతిని ముందుగా ఫరీదాబాద్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు; బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసుకున్న తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు వెల్లడించారు.


Posted

in

by

Tags: