ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సమీపంలో ఉన్న నైని ప్రాంతంలో సంచలనం సృష్టించిన 70 ఏళ్ల వృద్ధుడి హత్య కేసును పోలీసులు కేవలం 36 గంటల్లోనే ఛేదించారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో మరో వృద్ధుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.
అసలేం జరిగింది?
ప్రయాగ్‌రాజ్ ప్రాంతానికి చెందిన హజారీలాల్ (70) కు, అదే ప్రాంతానికి చెందిన రామ్‌లాల్ (66) భార్య అనార్కలి (65) తో గత ఎనిమిదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై రామ్‌లాల్ కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. తన భార్య తనను నిర్లక్ష్యం చేయడం, సమాజంలో ఎదురవుతున్న అవమానాలను భరించలేకపోయిన రామ్‌లాల్, ఎలాగైనా హజారీలాల్ను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పది రోజుల ముందే పథకం రచించాడు.
ఘాతుకం సాగిందిలా..
ఏప్రిల్ 2వ తేదీ అర్ధరాత్రి దాటాక, ఇసుక క్వారీ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న హజారీలాల్ మంచంపై నిద్రిస్తుండగా రామ్‌లాల్ అక్కడికి చేరుకున్నాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో, అక్కడ దాచి ఉంచిన గొడ్డలిని తీసుకుని హజారీలాల్ తలపై బలంగా నరికాడు. హజారీలాల్ కిందపడిపోగానే, కక్ష తీరని రామ్‌లాల్ అతని ముఖం, తలపై పదే పదే వేటు వేశాడు. దీంతో హజారీలాల్ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
పోలీసుల దర్యాప్తు – అరెస్ట్
హత్య అనంతరం రామ్‌లాల్ ఆ గొడ్డలిని తన ఇంట్లోని ఇసుక కుప్ప కింద దాచిపెట్టాడు. హజారీలాల్ కుమారుడు సోను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నైని పోలీసులు, సాంకేతిక ఆధారాలు మరియు స్థానికుల సమాచారం మేరకు నిందితుడు రామ్‌లాల్‌ను కేవలం 36 గంటల్లోనే పట్టుకున్నారు.
విచారణలో రామ్‌లాల్ తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు హత్యకు వాడిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్‌కు తరలించారు. జీవిత చరమాంకంలో జరిగిన ఈ అక్రమ సంబంధం మరియు ఆవేశం.. రెండు కుటుంబాలను రోడ్డున పడేసి ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపాయి.
