7 గురు కుమార్తెలు.. తండ్రి లేడు! కుటుంబాన్ని పోషించిన తల్లీ ఆకస్మిక మృతి: తల్లి పాడె మోసిన ఆడబిడ్డలు.. అంతిమ సంస్కారాలు నిర్వహించిన చిన్న కుమార్తె: కంటతడి పెట్టిస్తున్న ఘటన..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఔరయ్యా జిల్లాలో, ఆడపిల్లలపై సమాజంలో ఉన్న పాత మూఢనమ్మకాలకు చరమగీతం పాడేలా ఓ అద్భుత ఘట్టం చోటుచేసుకుంది.

తల్లిని కోల్పోయిన ఆవేదనలో ఉన్న ఏడుగురు కుమార్తెలు ఏకమై, స్వయంగా తల్లి పాడెను తమ భుజాలపై మోశారు. సాధారణంగా మహిళలు అంత్యక్రియల్లో పాల్గొనకూడదనే సంప్రదాయ నమ్మకాలు కొన్నిచోట్ల ఇంకా కొనసాగుతుండగా, ఈ కుటుంబంలోని ఆడబిడ్డలే తమ తల్లి చివరి వీడ్కోలు బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. ముఖ్యంగా, చిన్న కుమార్తె తల్లి చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలు పూర్తి చేయడం స్థానికుల హృదయాలను కదిలించింది.

కొన్నేళ్ల క్రితమే ఈ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన తండ్రి మరణించాడు. అప్పట్లో సమాజ సంప్రదాయాల ప్రకారం బంధువుల సాయంతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి లేకపోయినా, ఆ తల్లి ఒంటరిగానే కష్టపడి తన ఏడుగురు కుమార్తెలను ప్రయోజకులుగా తీర్చిదిద్దింది. బిడ్డల పెంపకం నుంచి వారి భవిష్యత్తు వరకు అన్ని బాధ్యతలను తానే మోసింది. దీంతో ఆ ఏడుగురు ఆడపిల్లలకు తల్లే సర్వస్వమైంది. అలాంటి తల్లి అకస్మాత్తుగా కన్నుమూయడం వారిని తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది.

అంతిమ సంస్కారాల సమయం రాగానే, కర్మకాండలు ఎవరు చేయాలనే ప్రశ్న తలెత్తింది. ఆ సమయంలో, “మగపిల్లలకు ఏమాత్రం తీసిపోకుండా మమ్మల్ని అల్లారుముద్దుగా పెంచిన అమ్మకు చివరి వీడ్కోలు మేమే ఇస్తాం” అని ఆ ఏడుగురు అక్కాచెల్లెళ్లు తీర్మానించుకున్నారు. అనుకున్నట్లే ఏడుగురూ కలిసి కన్నీటి వీడ్కోలు పలుకుతూ తల్లి పాడెను మోశారు. అనంతరం చిన్న కుమార్తె ముందుండి శాస్త్రోక్తంగా అంతిమ కర్మలను పూర్తి చేసి, తల్లి చితికి నిప్పంటించింది. ఈ దృశ్యాన్ని చూసిన బంధువులు, గ్రామస్తులు కంటతడి పెట్టారు.

తల్లి అంతిమ ప్రయాణంలో కుమార్తెలు తీసుకున్న ఈ నిర్ణయం.. “అంతిమ సంస్కారాలు కొడుకులు మాత్రమే చేయాలి” అనే పాత ఛాందస భావాలకు బలమైన సమాధానం ఇచ్చింది. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, బాధ్యతలను చాటడానికి ఆడ, మగ అనే తేడాలు అడ్డుకావని ఈ ఏడుగురు సోదరీమణులు నిరూపించారు. తల్లిని కోల్పోయిన తీరని దుఃఖంలోనూ ఆఖరి రుణం తీర్చుకున్న ఆ ఆడబిడ్డల తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *