ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్ జిల్లాలో 45 ఏళ్ల రాజ్‌కిశోర్ దుబే అనే వ్యక్తి మృతదేహం ఓ చెట్టు సమీపంలో లభ్యమైంది.
అతను ఇటీవలే ఏడేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. సుమారు నెలన్నర క్రితమే జైలు నుంచి విడుదలైన అతను, తన సోదరి ఇంట్లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాత్రి సమయంలో అతని మృతదేహం లభ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది.
రాజ్‌కిశోర్ దుబే తలపై బుల్లెట్ గాయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి రెండు .315 బోర్ బుల్లెట్లను (తూటాలను) కూడా స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ బృందాన్ని కూడా రప్పించి వేలిముద్రలతో పాటు కీలక ఆధారాలను సేకరించారు. అతను ఎలా మృతి చెందాడనే దానిపై పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి పెద్ద శబ్దం వినిపించిందని, ఆ తర్వాత వెళ్లి చూడగా రాజ్‌కిశోర్ దుబే రక్తపు మడుగులో పడి ఉన్నాడని తెలిపారు. అతను గతంలో ఓ హత్యాయత్నం కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు చెప్పారు. సుమారు ఎనిమిదేళ్ల క్రితం మద్యం మత్తులో ఓ వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపిన ఘటనలో అతనిపై కేసు నమోదైనట్లు వెల్లడించారు.
మరోవైపు, రాజ్‌కిశోర్ మృతి హత్యా లేక ఆత్మహత్యా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన నెలన్నరలోనే తలపై బుల్లెట్ గాయంతో అతను శవమై కనిపించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

Leave a Reply