మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమయ్యాయి. అమెరికాతో యుద్ధాన్ని ముగించే విషయంలో ఎలాంటి చర్చలు జరపాలన్నా, ఇరాన్ ప్రతిపాదించిన 7 షరతులను తప్పనిసరిగా నెరవేర్చాలని ఆ దేశ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రధాన సంధానకర్త మరియు పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘలీబాఫ్ వెల్లడించారు.
ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ 7 షరతులను అధికారికంగా పూర్తిస్థాయిలో బయటపెట్టలేదు. అయితే, ఆ దేశ ప్రభుత్వ మీడియా విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఇరాన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడం, ఇరాన్ ఓడరేవులపై అమెరికా నావికాదళ దిగ్బంధనాన్ని ముగించడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను తిరిగి అప్పగించడం వంటి డిమాండ్లు వాటిలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, శత్రువులు ఏదైనా తప్పు చేస్తే ఘర్షణల భౌగోళిక పరిధిని మరింత విస్తరిస్తామని ఘలీబాఫ్ హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాలలో ఒకటైన హార్ముజ్ జలసంధిలో 3 చమురు నౌకలు సముద్రంలో అమర్చిన మందుపాతరలకు (Sea Mines) తగిలి అగ్నికి ఆహుతైనట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ నావికాదళం ప్రకటించింది. సముద్ర రవాణా నిబంధనలను ఉల్లంఘించడం వల్లే ఈ ఘటన జరిగిందని, అమెరికా వైమానిక రక్షణ ఉన్నప్పటికీ నౌకలకు నిప్పంటుకుందని ఇరాన్ పేర్కొంది. అయితే, ఈ వాదనలు స్వతంత్రంగా ధృవీకరించబడలేదు.
మరోవైపు, గాజాలో ఇజ్రాయెల్ జరిపిన మూడు వేర్వేరు దాడులలో కనీసం 8 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గాజా నగరంలో జరిగిన దాడిలో ఇద్దరు, దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌పై జరిగిన దాడిలో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మధ్య గాజాలో జరిగిన మరో దాడిలో ఒక చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. గత ఏడాది కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ దాడులు కొనసాగుతున్నాయని చెబుతున్న నేపథ్యంలో, ఇరాన్ – అమెరికా మధ్య ఉద్రిక్తత, హార్ముజ్ జలసంధి ఘటన, గాజా దాడులతో మధ్యప్రాచ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.

Leave a Reply