ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గుండెల్ని పిండేసే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐదుగురు పిల్లల తల్లి అయిన భార్య తన ప్రియుడితో లేచిపోవడమే కాకుండా, భర్తను హీనంగా మాట్లాడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన 45 ఏళ్ల వ్యక్తి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. కసౌదా గ్రామానికి చెందిన లల్లూ గౌతమ్ (45) కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతనికి సోనీ అనే మహిళతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 7 నుంచి 16 సంవత్సరాల వయసు గల ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఈ క్రమంలో రెండు నెలల క్రితం సోనీ తన గ్రామానికే చెందిన బిపిన్ రావ్ అనే వ్యక్తితో కలిసి అకస్మాత్తుగా పారిపోయింది. భార్య విడిచి వెళ్లడంతో కుంగిపోయిన లల్లూ గౌతమ్.. ఆమెను ఎలాగైనా తిరిగి తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నించడంతో పాటు, ముఖ్యమంత్రి గ్రీవెన్స్ పోర్టల్లో కూడా ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనపై లల్లూ 16 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు కన్నీటిపర్యంతమవుతూ.. “అమ్మ ఇల్లు విడిచి వెళ్లినప్పటి నుంచి నాన్న ప్రతిరోజూ ఫోన్ చేసి ఏడుస్తూ ఇంటికి రమ్మని బతిమాలేవారు. సోమవారం వస్తానని చెప్పిన అమ్మ రాలేదు. బుధవారం నాన్న మళ్లీ ఫోన్ చేసి.. ‘నువ్వు ఇంటికి రాకపోతే నేను విషం తాగి చచ్చిపోతాను’ అని చెప్పారు. దానికి అమ్మ ఏమాత్రం కనికరం లేకుండా.. ‘వెళ్లి విషం తాగి చావు’ అని తేల్చి చెప్పింది” అని రోదిస్తూ తెలిపారు.
భార్య ఇచ్చిన ఈ నిర్దయ సమాధానంతో తీవ్ర మనస్తాపానికి గురైన లల్లూ.. తన పిల్లల కళ్లముందే మద్యం బాటిల్లో విషం కలుపుకుని తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు అతడిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో లల్లూ ప్రాణాలు విడిచాడు.
తండ్రిని కోల్పోయి అనాథలైన ఆ ఐదుగురు పసిపిల్లల రోదనలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.
