70 ఏళ్లకు పైగా సేవలందించిన సింగపూర్ ప్రముఖ భారతీయ రెస్టారెంట్ మూత: కస్టమర్ల ఆవేదన

సింగపూర్: సింగపూర్‌లోని సెరాంగూన్ రోడ్డులో ఉన్న ‘లిటిల్ ఇండియా’ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన సంప్రదాయ భారతీయ శాఖాహార హోటల్ ‘కోమల విలాస్’ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

గత 1947లో మురుగయ్య రాజు స్థాపించిన ఈ హోటల్‌ను ప్రస్తుతం ఆయన మనవడు రాజ్‌కుమార్ గుణశేఖరన్ (40) నిర్వహిస్తున్నారు. సుమారు 79 ఏళ్లుగా నడుస్తున్న ఈ పురాతన రెస్టారెంట్, ఇంట్లో వండిన రుచులను అందించడం వల్ల స్థానికులనే కాకుండా పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షించేది. ముఖ్యంగా ఇక్కడ అరటి ఆకుల్లో వడ్డించే దక్షిణ భారతీయ భోజనం చాలా ప్రసిద్ధి. గత 2015లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి సింగపూర్ ప్రధాని లీ సియన్ లూంగ్ కలిసి ఈ హోటల్‌లో భోజనం చేయడం విశేషం.

సింగపూర్ నేషనల్ హెరిటేజ్ బోర్డ్ (NHB) గుర్తింపు పొందిన ఈ హోటల్, ఈ ఏడాది జనవరి 19 నుంచి మూతపడటం వినియోగదారులను ఆవేదనకు గురిచేస్తోంది. మరమ్మతు పనుల (Maintenance) నిమిత్తం హోటల్ మూసివేసినట్లు చెబుతున్నప్పటికీ, గత రెండు నెలలుగా అక్కడ ఎలాంటి పనులు జరగకపోవడంతో ఇది మళ్లీ తెరుచుకుంటుందా లేదా శాశ్వతంగా మూసివేస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


Posted

in

by

Tags: