అట్లాంటిక్ మహాసముద్రం అడుగున 4,700 మీటర్ల లోతులో, సుమారు 70 ఏళ్ల క్రితం పారబోసిన రేడియోధార్మిక (Radioactive) వ్యర్థాల పీపాల ప్రస్తుత భయానక స్థితికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
యూరప్ దేశాలు 1950 నుండి 1990 మధ్య కాలంలో సుమారు 2 లక్షలకు పైగా అణు వ్యర్థాల పీపాలను సముద్రంలోకి విసిరేశాయి. ఫ్రాన్స్ దేశానికి చెందిన పరిశోధన బృందం జరిపిన అధ్యయనంలో, ఈ పీపాలన్నీ పూర్తిగా తుప్పుపట్టి, వాటిలోని రేడియోధార్మిక వ్యర్థాలు సముద్రం అడుగున లీక్ అవ్వడం ప్రారంభమైనట్లు గుర్తించారు.
అణు విద్యుత్ కేంద్రాలు, ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాల నుండి వెలువడిన సుమారు 1.5 లక్షల టన్నుల ప్రమాదకరమైన వ్యర్థాలు ఇందులో ఉన్నాయి. ‘నాటిల్’ (Nautile) అనే ఆధునిక జలాంతర్గామి (సబ్మెరైన్) ద్వారా సముద్రపు లోతుల్లోకి వెళ్లిన ఫ్రాన్స్ దేశపు ‘CNRS’ పరిశోధన బృందం.. ఈ పీపాలు లీకవుతున్న షాకింగ్ దృశ్యాలను స్వయంగా పరిశీలించింది.
ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తుప్పుపట్టిన ఈ ప్రమాదకరమైన పీపాలపైనే స్పాంజ్లు, సముద్రపు చామంతి (Sea anemones), పీతలు వంటి అనేక అరుదైన సముద్ర జీవులు అతుక్కుని జీవిస్తున్నాయి. ఈ జీవులను, వాటి చుట్టూ ఉన్న నీరు, మట్టిని పరిశోధకులు నమూనాలుగా (Samples) సేకరించి తీసుకెళ్లారు.
ఈ రేడియోధార్మిక వికిరణం (రేడియేషన్) సముద్ర జీవులను, సముద్ర పర్యావరణాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేసిందనే విషయాన్ని శాస్త్రవేత్తలు తీవ్రంగా పరిశోధిస్తున్నారు. 1993లో సముద్రంలో అణు వ్యర్థాలను పారబోయడంపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం విధించినప్పటికీ, దశాబ్దాల క్రితం చేసిన ఈ తప్పు ఇప్పుడు పెను ముప్పుగా మారింది.

Leave a Reply