“70 ఏళ్లు నిండగానే సంచలన నిర్ణయం..!” ట్రెంట్, టైటాన్ సహా 6 ప్రధాన కంపెనీల బోర్డుల నుంచి తప్పుకోనున్న నోయెల్ టాటా.. టాటా గ్రూప్‌లో భగ్గుమన్న వివాదం..!!

టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా వచ్చే నవంబర్ 12వ తేదీన 70వ పడిలోకి అడుగుపెడుతున్నందున.. ట్రెంట్, వోల్టాస్, టాటా స్టీల్, టైటాన్ సహా టాటా గ్రూప్‌నకు చెందిన 6 ప్రధాన కంపెనీల బోర్డు బాధ్యతల నుంచి ఆయన తప్పుకోనున్నట్లు సమాచారం.

టాటా గ్రూప్ యొక్క ‘నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల’ పదవీ విరమణ నిబంధనల ప్రకారం ఈ మార్పు జరగనుండగా.. టాటా గ్రూప్ ప్రధాన మాతృ సంస్థ అయిన ‘టాటా సన్స్’ బోర్డు సభ్యుడిగా, టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా ఆయన యథావిధిగా కొనసాగుతారు.

టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మూడోసారి పొడిగించడం, సంస్థను స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయడం వంటి కీలక విషయాలపై నోయెల్ టాటాకు, టాటా సన్స్ యాజమాన్యానికి మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

ముఖ్యంగా, చంద్రశేఖరన్ పదవీకాలం పొడిగింపునకు సంబంధించిన సమావేశం రికార్డులు (మినిట్స్), ఓటింగ్ వివరాలను అందజేయాలని కోరుతూ నోయెల్ టాటా లేఖ రాయడంతో టాటా గ్రూప్ కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.

నోయెల్ టాటా ఆయా బోర్డుల నుంచి తప్పుకున్నప్పటికీ, ట్రెంట్ హైపర్‌మార్కెట్ సంస్థలో మాత్రం కొనసాగుతారని తెలుస్తోంది. కాగా, ఆయన తప్పుకోనున్న 6 కంపెనీలకు కొత్త చైర్మన్ల నియామకంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.


Posted

in

by

Tags: