గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్ సివిల్ ఆసుపత్రిలో తీసిన ఒక వైరల్ వీడియో, ప్రభుత్వ ఆసుపత్రుల దయనీయమైన పరిస్థితిని కళ్లకు కట్టింది.
చేతిలో కర్ర పట్టుకుని తనకే ఆసరా కావాల్సిన సుమారు 70 ఏళ్ల వయస్సు గల ఒక వృద్ధురాలు, తన చేతులతో భర్తను స్ట్రెచర్‌పై ఉంచి నెట్టుకుంటూ తీసుకెళ్తున్న దృశ్యం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
రాజ్‌కోట్ సివిల్ ఆసుపత్రి సౌరాష్ట్ర ప్రాంతంలోనే అత్యంత పెద్దది మరియు ముఖ్యమైన ప్రభుత్వ ఆసుపత్రులలో ఒకటి. ఎక్కువ ఖర్చు చేయలేని నిరుపేదలు ఎంతోమంది నమ్ముకుని వచ్చే ఈ ఆసుపత్రిలో, రోగులను ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి తరలించడానికి స్ట్రెచర్లు ఉన్నాయి. కానీ, వాటిని నడపడానికి లేదా నెట్టడానికి ఆసుపత్రి సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడమే ఇక్కడ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
రోగి ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితుల్లో, అతనితో వచ్చిన 70 ఏళ్ల వృద్ధురాలే కష్టపడుతూ స్ట్రెచర్ నెట్టుకెళ్తున్న దృశ్యం చూసేవారిని తీవ్రంగా కలిచివేసింది. ‘ఈ వయసులో వృద్ధురాలు ఇంత కష్టపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆసుపత్రి సిబ్బంది ఏం చేస్తున్నారు?’ అని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఈ వ్యవహారం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో, రాజ్‌కోట్ సివిల్ ఆసుపత్రి అకౌంట్స్ ఆఫీసర్ M.S. రాయ్ వివరణ ఇచ్చారు. ఈ ఘటన తీవ్ర విచారకరమైనదని తెలిపిన ఆయన, దీనిపై సమగ్ర విచారణకు ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా, దీనికి సంబంధించి సదరు ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీకి నోటీసులు పంపినట్లు వెల్లడించారు.
భవిష్యత్తులో ఇలాంటి దయనీయమైన సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన మార్గదర్శకాలను రూపొందిస్తామని, రోగులను స్ట్రెచర్లలో తీసుకెళ్లడానికి తగినంత మంది సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా యాజమాన్యం చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply